Nara Lokesh: విశాఖను ఐటీ హబ్‌గా మలిచే దిశగా లోకేష్..ఐదు లక్షల ఉద్యోగాల హామీ
ABN , Publish Date - Jun 21 , 2025 | 10:53 AM
మా ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, అందరితో కలిసి పనిచేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. యోగాంధ్ర కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఈ మేరకు పేర్కొన్నారు.

ఏపీలోని విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తాజాగా స్పందించారు. ఈ కార్యక్రమం నిర్వహణపై సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రుల కోరికలను నెరవేర్చుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. యోగాంధ్ర విజయవంతంగా నిర్వహించబడటంతో, మాకు గురుతర బాధ్యత నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రెండు వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పినట్లు చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అట్రాక్షన్ గా నిలిచిందన్నారు.
అనుకున్న దానికంటే..
ప్రధానికి గిన్నిస్ రికార్డు కానుక ఇవ్వాలని యోగాంధ్ర నిర్వహించామని, ఆశించిన దాని కంటే ఎక్కువ మంది దీని కోసం వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లనే యోగాంధ్ర విజయవంతమైందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రధాని మోదీ అభినందించడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఆయన పిలుపు మేరకు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారని వెల్లడించారు. ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయడం వల్లే యోగాంధ్ర ప్రశాంతంగా ముగిసిందన్నారు. ప్రధాని వ్యాఖ్యలను బాధ్యతగా స్వీకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
99 పైసలకే ఎకరా భూమి
'యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రుల విజయం. అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తాం. దక్షిణ భారతదేశంలో ఉన్నతమైన ఐటీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతామని' మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఐటీని ప్రోత్సహించాలంటే మెరుగైన సదుపాయాలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 99 పైసలకే ఎకరా భూమి ఇవ్వడం వల్ల టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు రాష్ట్రంలోకి వచ్చాయని మంత్రి లోకేష్ వివరించారు.
రాష్ట్రానికి ఒక కొత్త దిశ
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రాష్ట్రం ఆర్థిక స్థితిని మెరుగుపరచడం వంటి అంశాలు ముఖ్యమైనవని ప్రస్తావించారు మంత్రి లోకేష్. మా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. యువతకు మంచి అవకాశాలు కల్పించడం, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడటమే మా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త దిశను చూపించిందన్నారు. ప్రజల చైతన్యం, ప్రభుత్వ చర్యలు, ప్రైవేట్ రంగం సహకారం కలిసినప్పుడు రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు నారా లోకేష్.
ఇవీ చదవండి:
9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు
సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి