Nara Bhuvaneshwari: ఆపన్నులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:12 AM
ఆపదలో ఉండి ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్ట్ తలుపు తట్టిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ట్రస్టీ నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. మాట ఇస్తే దాన్ని చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపు తడితే చాలు: భువనేశ్వరి
విజయవాడలో నూతన భవనానికి భూమి పూజ
విజయవాడ/అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉండి ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్ట్ తలుపు తట్టిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ట్రస్టీ నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. మాట ఇస్తే దాన్ని చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ కేపీ నగర్‌లో నూతనంగా నిర్మించనున్న ట్రస్ట్ భవన నిర్మాణానికి ఆమె గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్ట్ స్థాపించి 28ఏళ్లు పూర్తయిందని తెలిపారు. ప్రజల కోసం ఎప్పుడూ ముందుండాలని ఈ ట్రస్ట్‌ను చంద్రబాబు ఏర్పాటుచేశారని చెప్పారు. సమాజానికి అవసరమైన కార్యక్రమాలు చేయడానికి ట్రస్ట్ ముందుంటుందని పేర్కొన్నారు. విజయవాడ భవనంలో ట్రస్ట్ కార్యాలయం, రక్తనిధి, తలసేమియా కేంద్రం ఉంటాయని వివరించారు. కొత్తగా నిర్మించే భవనాన్ని 2026 ఫిబ్రవరిలో ప్రారంభిస్తామన్నారు. యుఫోరియా మ్యూజికల్ నైట్ ద్వారా సమకూరిన నిధులను తలసేమియా పిల్లలకు ఉపయోగిస్తామని, సమాజం కోసం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సంజీవని ఫ్రీ హెల్త్ క్లినిక్‌ల కింద 1.60లక్షల మందికి సేవలందించడానికి రూ.4.02కోట్లు ఖర్చు చేశామని, 14,056 ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 20లక్షల మందికి వైద్యసేవలు అందించామని, దీనికోసం రూ.22.43 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గండిపేటలో స్కూల్, డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నామని, చల్లపల్లిలో పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని వారికోసం స్కూల్ నడుపుతున్నామని చెప్పారు. అక్కడ 2,020మంది పిల్లలకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య, వసతి కల్పిస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి కార్యక్రమంలో మహిళలకు 35 తోపుడు బండ్లు, 47 కుట్టుమిషన్లను రూ.25 లక్షలతో పంపిణీ చేశామని చెప్పారు. ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు సహకరించిన దాతలకు భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు పాల్గొన్నారు.
కోట్లాది మందిని ఆదుకున్న ట్రస్ట్: బాబు
‘పేదలకు, అభాగ్యులకు సాయం అందించే లక్ష్యంతోఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ విపత్కర పరిస్థితుల్లో కోట్లాది మందిని ఆదుకుంది. తలసేమియా బాధిత పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్న ట్రస్ట్ తన సేవలు విస్తరించడంలో భాగంగా విజయవాడలో సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్న నేపథ్యంలో ట్రస్ట్ నిర్వాహకులు, దాతలకు అభినందనలు’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.