Sagar Dam Security Shift: ఒకే సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కు సాగర్ రక్షణ
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:46 AM
కేంద్రం నిర్ణయం ప్రకారం, నాగార్జున సాగర్ డ్యామ్ రక్షణ బాధ్యతను ఒక్క సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ (విశాఖ)కి అప్పగించారు. ములుగు బెటాలియన్‌ను ఉపసంహరించగా, ఎస్పీఎఫ్ బలగాలు కూడా కాపలా ఉంటాయి

ములుగు బయలుదేరి వెళ్లిన 39వ బెటాలియన్
తెలంగాణ వైపు అదనంగా ఎస్పీఎఫ్ కాపలా
నాగార్జునసాగర్/ మాచర్ల, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ రక్షణ బాధ్యతను ఇక నుంచి ఒక సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కే పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకూ తెలంగాణ వైపు సీఆర్‌పీఎఫ్ ములుగు బెటాలియన్, ఏపీ వైపు విశాఖ బెటాలియన్ బలగాలు కాపలా కాస్తున్నాయి. కానీ, కేంద్రం ఖర్చును తగ్గించుకోవడానికి సీఆర్‌పీఎఫ్ ములుగు బెటాలియన్‌ను పూర్తిగా ఉపసంహరించి.. నాగార్జున సాగర్ డ్యామ్ రక్షణ బాధ్యతను పూర్తిగా విశాఖ బెటాలియన్‌కు అప్పగించింది. ఎడమ వైపు రక్షణ బాధ్యత నిర్వర్తిస్తున్న 39వ (ములుగు) బెటాలియన్ సిబ్బందిని వెనక్కి వెళ్లిపోవాలని ఈ నెల ఆరో తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశించింది. ఎడమ వైపు డ్యాం రక్షణ బాధ్యతలు కూడా స్వీకరించాలని 234వ (విశాఖ) బెటాలియన్‌కు మంగళవారం కేఆర్‌ఎంబీ ఆదేశాలు జారీచేయడంతో విశాఖ బెటాలియన్ జవాన్లు మధ్యాహ్నం 12 గంటలకు ఎడమ వైపుకు చేరుకున్నారు. డ్యామ్ రక్షణ బాధ్యతను 234వ బెటాలియన్ అధికారి శ్రీనివాసరావుకు ములుగు బెటాలియన్ అధికారి వీర రాఘవయ్య అప్పగించారు. అటుపై మధ్యాహ్నం ఒంటిగంటకు ములుగు బెటాలియన్ బలగాలు నాగార్జున సాగర్ ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లిఖార్జున రావుకు సమాచారమిచ్చి హిల్ కాలనీలోని తమ క్యాంపుకు చేరుకున్నాయి. సాయంత్రం వచ్చిన ఏడు వాహనాల్లో 39వ బెటాలియన్ జవాన్లు ములుగుకు బయలుదేరాయి. తెలంగాణ వైపు సీఆర్‌పీఎఫ్ విశాఖ బెటాలియన్‌తోపాటు ఎస్పీఎఫ్ బలగాలు కాపలా ఉంటాయి.
సాగర్ ఇన్‌చార్జి ఎస్‌ఈ ఏమన్నారంటే..!
సాగర్ ప్రాజెక్టు భద్రతను మాత్రమే సీఆర్పీఎఫ్ 234 (విశాఖ) బెటాలియన్‌కు అప్పగించారని ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లిఖార్జున్‌రావు చెప్పారు. డ్యామ్ నిర్వహణ బాధ్యత తెలంగాణదేనన్నారు. కేఆర్‌ఎంబీ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ డ్యామ్‌కిరువైపులా విశాఖ సీఆర్పీఎఫ్ బలగాలే రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..
సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
For More AP News and Telugu News