Vijayawada Court: వంశీకి రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:43 AM
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ మోహన్ సహా నిందితులకు న్యాయస్థానం ఏప్రిల్ 22 వరకు రిమాండ్ పొడిగించింది. మరోవైపు రంగా దాడి కేసుతో పాటు కిడ్నాప్ కేసులో కూడా రిమాండ్‌లో కొనసాగుతున్నారు

విజయవాడ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌తోపాటు మిగిలిన నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. ఇంతకుముందు విధించిన రిమాండ్ గడువు ముగియడంతో నిందితులు వంశీ, గంటా వీర్రాజు, వెలినేని శివరామకృష్ణప్రసాద్, నిమ్మ చలపతి, వేల్పూరి వంశీబాబులను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో మంగళవారం హాజరుపరిచారు. వారికి 22 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి హిమబిందు ఆదేశాలు జారీచేశారు. కాగా, వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగారావు అలియాస్ రంగాకు రిమాండ్‌లో ఉండగానే మరో రిమాండ్ పడింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రంగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో న్యాయాధికారి హిమబిందు రంగాకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు.