Nara Lokesh: సజ్జల సన్నిహితుడిపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:49 AM
మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ మోసం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు అడపా ప్రేమ్‌చంద్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ను బాధితుడు మన్నే సుబ్బారావు అభ్యర్థించారు.

మెడికల్ సీటు ఇప్పిస్తామని మోసం చేశారు
రూ.1.20 కోట్లు చెల్లించా..న్యాయం చేయండి
నారా లోకేశ్‌కు బాధితుడి అభ్యర్థన
ప్రజాదర్భార్‌లో పిటిషన్లు స్వీకరించిన మంత్రి
తాడేపల్లి (ఉండవల్లి), జూలై 1 (ఆంధ్రజ్యోతి): మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ మోసం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు అడపా ప్రేమ్‌చంద్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ను బాధితుడు మన్నే సుబ్బారావు అభ్యర్థించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన సుబ్బారావు మంగళవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ‘‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నా కుమారుడికి సీటు ఇప్పించడానికి ప్రేమ్‌చంద్, గుత్తుల అవినాష్, కట్టేవాటి బాలిరెడ్డి తొలుత రెండు కోట్లు అడిగారు. మేం రూ. 1.20 కోట్లు చెల్లించాం. ఆ తర్వాత ఆ సీటు కోసం నాలుగు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత సొమ్ము చెల్లించలేమని చెప్పడంతో బెంగళూరులోని రామయ్య మెడికల్ కాలేజిలో సీటు ఇప్పిస్తామని తీసుకెళ్లారు. అలాట్‌మెంట్‌కు సంబంఽధించి నకిలీ లేఖను చేతిలో పెట్టి ప్రేమ్‌చంద్ మోసం చేశారు. మేం కట్టిన రూ. 1.20 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరితే, సజ్జల పేరు చెప్పి బెదిరిస్తున్నారు.’’ అని సుబ్బారావు వాపోయారు. వినతిపత్రం పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు. కాగా, ప్రజాదర్బార్‌కు భారీగా అర్జీదారులు విచ్చేసి తమ సమస్యలను లోకేశ్‌కు విన్నవించుకున్నారు. ఎస్‌సీఎంఏ (స్పైనల్ మస్కులర్ అట్రోపీ) అనే ప్రాణాంతక సమస్యతో బాధపడుతున్న తొమ్మిది నెలల బాబును తీసుకుని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన జొన్నాడ సాయిరామ్ వచ్చారు. ప్రతి పదివేల మందిలో ఒకరు ఎస్‌సిఎంఏతో జన్మిస్తారని, ప్రపంచంలో ఖరీదైన జోల్ జెనిస్మా మందు ఒక్కటే తమ బాబును బతికించగలదని వాపోయారు.
వైద్య సహాయం అందించాలని అభ్యర్థించారు. కంతేరులో తమ కుటుంబానికి చెందిన 0.70 ఎకరాల వ్యవసాయ భూమిని విక్రయించగా, తమకు ఇవ్వాల్సిన మొత్తంలో రూ.12లక్షలను విష్ణు రాము అనే వ్యక్తి ఎగ్గొట్టడమే కాకుండా, దౌర్జన్యానికి దిగుతున్నారని ఉండవల్లికి చెందిన కళ్లం విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. టీడీపీ సానుభూతిపరుడనైన తన ఇంటిని వైసీపీ ప్రభుత్వ హయాంలో కూల్చివేసి, తనకు ఉన్న 2.50 ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని నెల్లూరు జిల్లా తిమ్మసముద్రానికి చెందిన తోటకూర వెంకట సురేశ్ వాపోయారు. పల్నాడు జిల్లాలోని బిషప్స్, పాస్టర్స్ క్రైస్తవ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని పల్నాడు డిస్ట్రిక్టు పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. సాక్షర భారత్ కార్యక్రమంలో సేవలందిస్తున్న సుమారు 1840 మంది గ్రామ సమన్వయకర్తలకు న్యాయం చేయాలని ఉమ్మడి విజయనగరం జిల్లా సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తల యూనియన్ ప్రతినిధులు లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.