Share News

Nadendla Manohar: నాడు రైతుకు వైసీపీ సర్కారు ద్రోహం

ABN , Publish Date - Mar 07 , 2025 | 07:24 AM

‘రైతులు పండించిన ధాన్యం గత ఐదేళ్లూ కొనలేదు.. రైతులు బతిమాలుకుంటే అరకొరగా కొనుగోలు చేసినా ఆ ధాన్యానికి కూడా డబ్బులు చెల్లించలేదు’ అంటూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రైతాంగం పడిన కష్టాలపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌

Nadendla Manohar: నాడు రైతుకు వైసీపీ  సర్కారు ద్రోహం

  • అరకొరగా ధాన్యం కొన్నా డబ్బులివ్వలేదు

  • ధాన్యం బకాయిలు 1674 కోట్లు చెల్లించాం

  • ఇప్పుడు 48 గంటల్లో ఇస్తున్నాం

  • వ్యవసాయ సంస్కరణలు తీసుకొస్తాం

  • అసెంబ్లీలో మంత్రి మనోహర్‌

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ‘రైతులు పండించిన ధాన్యం గత ఐదేళ్లూ కొనలేదు.. రైతులు బతిమాలుకుంటే అరకొరగా కొనుగోలు చేసినా ఆ ధాన్యానికి కూడా డబ్బులు చెల్లించలేదు’ అంటూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రైతాంగం పడిన కష్టాలపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగంలోని సమస్యలపై చర్చించేందుకు గురువారం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వినతిపై స్వల్పకాలిక చర్చకు డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా గడచిన ఐదేళ్లు రైతుల పడ్డ ఇబ్బందుల్ని ఎమ్మెల్యేలు ఏకరువు పెట్టారు. జనసేన ఎమ్మెల్యే పులవర్తి రామాంజినేయులు మాట్లాడుతూ.. వ్యవసాయానికి కొంతైనా మేలు చేయాలనుకుంటే కేంద్రంతో చర్చించి ఉపాధి హామీ పథకంతో అనుసంధించాలని సూచించారు. మిల్లర్లు బియ్యాన్ని ఆ జిల్లా పరిధిలోనే కాకుండా తమకు నచ్చిన చోట అమ్ముకోవడానికి అనుమతించాలని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి కోరారు. రైతులకు ప్రోత్సాహం అందించి సన్నబియ్యం రకాల సాగుకు కృషిచేస్తే రేషన్‌ డిపోల్లో తిరస్కరించే అవకాశమే ఉండబోదని టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సూచించారు. అనంతరం మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత ఐదేళ్ల అరాచక పాలనలో విచిత్రమైన యాప్‌లు తీసుకొచ్చి తమకు నచ్చిన మిల్లులకు, తమకు కావాల్సిన రైతుల్ని పంపి సామాన్య రైతాంగానికి తీరని ద్రోహం చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అలాంటి కష్టాలు ఉండకూడదని సీఎం చంద్రబాబు సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, ఇందులో భాగంగా వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యేనాటికి రైతులకు 1674కోట్లు అప్పు చెల్లించాల్సి వచ్చిందని, అంతేకాకుండా ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల డబ్బులు 48 గంటల్లోపే రైతులకు చెల్లిస్తున్నామని తెలిపారు.


హౌసింగ్‌ అక్రమాలపై చర్యలు తప్పవు: పార్థసారథి

వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలుతోపాటు ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి ఈ వ్యవహారంలో 700కోట్లు దోచేశారని, విజిలెన్సు చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కోరారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఈ దోపిడీ జరిగిందని డిప్యూటీ స్పీకర్‌ రఘురామరాజు వ్యాఖ్యానించగా మెజారిటీ ఎమ్మెల్యేలు అవునంటూ సమర్థించారు. నరసరరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రభుత్వ భూమి ఆక్రమించి ప్లాట్లుగా విక్రయించి కోట్లు దోచేశారని, చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌ బాబు కోరారు. తిరుపతిలో రూ.800కోట్ల ఒంటేరు చెరువు స్థలాన్ని కబ్జాచేసేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలపై చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి కోరారు. పంచాయతీల పరిధిలోని తాగునీటి ప్లాంట్ల మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి జీరో అవర్‌లో సభ దృష్టికి తీసుకొచ్చారు. గోదావరిలోకి రాజమహేంద్రవరంలోని డ్రైనేజీ నీరు చేసి పొలాలు కలుషితమవుతున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలంటూ పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర విన్నవించారు.


మే నుంచి పాఠశాలలకు నాణ్యమైన బియ్యం

66 వేల టన్నుల పీడీఎస్‌ బియ్యం సీజ్‌ చేశాం

ప్రైవేటు గోదాములపై పర్యవేక్షణ పెంచాం: మనోహర్‌

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి మే నెల నుంచి నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థీకృత మాఫియా వ్యవస్థను సృష్టించారని ఆరోపించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో 76,854 టన్నుల బియ్యం సీజ్‌ చేస్తే, కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో 66 వేల టన్నుల బియ్యం, 517 వాహనాలను సీజ్‌ చేసిందన్నారు. తొలుత వైసీపీ హయాంలో పీడీఎస్‌ బియ్యంలో అక్రమాలను ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కూన రవికుమార్‌, రాధాకృష్ణ, వనమాడి వెంకటేశ్వరరావు, వెనిగళ్ల రాము సభ దృష్టికి తీసుకువచ్చారు. 2022-24లో అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌, అతని తండ్రి, తమ్ముడు చేతుల్లో వ్యవస్థలను పెట్టుకుని వ్యవహారం నడిపారని రాధాకృష్ణ, వనమాడి ఆరోపించారు.

ఆర్థిక సంఘం నిధుల్ని దారి మళ్లించారు: గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. గురువారం శాసనసభలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ తరపున మనోహర్‌ ఆయా శాఖలకు గ్రాంట్లు, నిధుల కోసం ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. సభ్యుల ప్రశ్నలకు మనోహర్‌ సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించి పంచాయతీలకు తీరని నష్టం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో పారిశుధ్య కార్యక్రమాలు, సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారంచుట్టిందన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 07:24 AM