Minister Manohar: రైతులకు నువ్వేం చేశావ్
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:15 AM
మనుషులనే కారుతో తొక్కించినోడికి రైతు కష్టం ఏం తెలుస్తుంది, తోతాపురి మామిడి రైతుల కష్టాన్ని రోడ్డుపైవేసి తొక్కిస్తావా? నీకు నువ్వే సమస్యలు సృష్టించి, అలజడులు రేపి, దాడులకు పాల్పడతానంటే ఈ ప్రభుత్వంలో కుదరదు.

నువ్వు పెట్టిన బకాయిలూ మేమే చెల్లించాం
మనుషుల్నే తొక్కించినోడికి రైతు కష్టం ఏం తెలుస్తుంది?
జగన్‌ను ఉద్దేశించి మంత్రి మనోహర్ వ్యాఖ్యలు
తెనాలి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మనుషులనే కారుతో తొక్కించినోడికి రైతు కష్టం ఏం తెలుస్తుంది? తోతాపురి మామిడి రైతుల కష్టాన్ని రోడ్డుపైవేసి తొక్కిస్తావా? నీకు నువ్వే సమస్యలు సృష్టించి, అలజడులు రేపి, దాడులకు పాల్పడతానంటే ఈ ప్రభుత్వంలో కుదరదు. చర్యలు కఠినంగా ఉంటాయి’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టే దమ్ము, ధైర్యం లేక రోడ్డున పడుతున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘నీకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే, నీ ప్రభుత్వంలో చేసిందేమిటో.. మేము వచ్చిన ఏడాదిలో చేసిందేమిటో చెప్పడానికి బహిరంగ వేదిక పైకి రావాల’ని సవాల్ విసిరారు. ‘వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 12.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే, మేము ఖరీఫ్, రబీ కలిపి 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. రూ.12,857 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. మీరు రైతులను మోసం చెల్లించకుండా వదిలేసిన ధాన్యం డబ్బు రూ.1674 కోట్లతో కలిసి మొత్తం రూ.14,531 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. మీరు అప్పట్లో చేసి వెళ్లిన పాపం కారణంగా 30 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాకుండా ఆగింది. వాటిని కూడా సరిచేసి రూ.659.39 కోట్లు కూడా వారి ఖాతాలో వేసేందుకు గురువారం విడుదల చేశాం’ అని మనోహర్ స్పష్టం చేశారు. తోతాపురి మామిడి రైతులకు కష్టం వచ్చిందంటూ చిత్తూరు జిల్లా వెళ్లి ఆయన అరాచకం సృష్టిస్తే మేము మాత్రం వారి ఖాతాల్లో రూ.260 కోట్లు వేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.