ఎంఎస్ఎంఈలపైనే రాష్ట్ర భవిష్యత్తు: కొండపల్లి
ABN , Publish Date - Mar 05 , 2025 | 06:34 AM
రాష్ట్ర భవిష్యత్తుఎంఎస్ఎంఈలపై ఆధారపడి ఉందని, బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయడానికి కృషిచేస్తామని ఎంఎ్‌సఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు.

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్తుఎంఎస్ఎంఈలపై ఆధారపడి ఉందని, బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయడానికి కృషిచేస్తామని ఎంఎ్‌సఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ.. కొత్త పారిశ్రామిక పాలసీ 4.0 కింద 2030 నాటికి ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎంఎ్‌సఎంఈ ద్వారా ఉద్యోగాల సృష్టిపై అధ్యయనం చేయాలని ఎమ్మెల్యేలు కోరగా.. దీనిపై ప్రత్యేక దృష్టిపెడతామని చెప్పారు. ఎంఎ్‌సఎంఈ పార్క్‌లను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేలా సర్వే చేస్తున్నామన్నారు. తొలుత ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర పథకాలు అనేకం ఉన్నాయని, వీటిపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీఐఐసీని ప్రక్షాళన చేయాలని, భూముల రేట్లు తగ్గించాలని కోరారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీఐఐసీ భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని సభ్యులు అంటున్నారని, తమిళనాడుతో పోల్చితే మన రాష్ట్రంలో చాలా తక్కువ ధరకు భూమి ఇస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. రూ.వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడి పెడితే ప్రత్యేక జీవో ద్వారా భూమి రేటు ఇంకా తగ్గిస్తామన్నారు.
తెలుగులో మాట్లాడండి: స్పీకర్ అయ్యన్న
మంత్రులు, ఎమ్మెల్యేలూ సాధ్యమైనంత వరకూ అసెంబ్లీలో తెలుగులోనే మాట్లాడాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఎంఎ్‌సఎంఈలపై ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంగ్లీష్‌లో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్ కల్పించుకుని ప్రజలకు అర్థమయ్యేందుకు తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. ఆతర్వాత ఎయిడ్స్ నివారణపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కూడా ఇంగ్లీష్‌లోసమాధానం చెప్పాలని భావించినా.. స్పీకర్ సూచనలతో తెలుగులోనే మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఎయిడ్స్ వ్యాప్తి తగ్గుతోందని, ఈ తగ్గుదల జాతీయ స్థాయిలో 79.26 శాతం ఉంటే మన రాష్ట్రంలో 86.26 శాతం ఉందని సత్యకుమార్ అసెంబ్లీలో చెప్పారు. హెచ్‌ఐవీ పాజిటివ్ రేటు 2010-11లో 4.13 శాతం ఉంటే 2023-24కు 0.78 శాతానికి తగ్గిందన్నారు. కాగా, విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థుల విషయంలో ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందని, కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏపీఎంసీ ముందుకెళ్తుందని సత్యకుమార్ చెప్పారు. విదేశాల్లో చదివిన వైద్య విద్యార్థుల సమస్యపై ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసుకు మంత్రి సమాధానం ఇచ్చారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థులు.. జాతీయ పరీక్షల మండలి నిర్వహించే ఎఫ్‌ఎంజీ స్ర్కీనింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులవ్వాలని, ఆ తర్వాత ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేశాకే వారికి శాశ్వత రిజిస్ట్రేషన్ వస్తుందన్నారు.