Minister Anita: తల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం గెలుపా జగన్
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:21 AM
ఎవరైనా ప్రత్యర్థులపై విజయం సాధిస్తే సంబరాలు చేసుకుంటారు. కానీ, జగన్ ‘రివర్స్’ అనే పదానికి బ్రాండ్ అంబాసిండర్

తల్లిని, చెల్లిని కోర్టుకు లాగడం అనైతికం కాదా?
డబ్బే ముఖ్యమనుకునే నీవు ప్రజాజీవితానికి అర్హుడివా
‘సరస్వతి’ షేర్లలో జగన్ తీరుపై మంత్రి అనిత ఫైర్
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): ‘‘ఎవరైనా ప్రత్యర్థులపై విజయం సాధిస్తే సంబరాలు చేసుకుంటారు. కానీ, జగన్ ‘రివర్స్’ అనే పదానికి బ్రాండ్ అంబాసిండర్. అందుకే సొంత తల్లి, చెల్లిపై విజయాన్ని కూడా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది కూడా ఓ గెలుపేనా జగన్?’’ అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. సరస్వతి పవర్ షేర్ల బదిలీ వివాదంలో తల్లి, చెల్లిపై కేసులు వేసిన జగన్, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో తనకు అనుకూలంగా వచ్చిన తీర్పుపై సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకుంటుండటంపై అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని కోర్టుకు లాగి, నైతిక విలువలు లేకుండా వ్యవహరించిన జగన్ ప్రజా జీవితానికి ఏ విధంగా అర్హుడని ప్రశ్నించారు. ఆర్థిక సంబంధాలు తప్ప మానవసంబంధాలు లేని వ్యక్తి నాయకుడు ఎలా అవుతారని నిలదీశారు. సొంత తల్లి, చెల్లిపై తాత్కాలికంగా పైచేయి సాధించడాన్ని కూడా గొప్ప విజయంగా ప్రచారం చేయించుకోవడం ద్వారా తన సైకో మనస్థత్వాన్ని చాటుకున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో గెలుపు కోసం తల్లి, చెల్లిని అడ్డం పెట్టుకుని, ఆ సమయంలో దానకర్ణుడిలా షేర్ల ను పంపకాలు చేసిన జగన్, వారి అవసరం తీరిపోగానే వెనక్కి లాక్కోవడం ఏమిటన్నారు.
కుటుంబసభ్యులపైనే కుట్ర..
‘‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే సరస్వతి పవర్‌లో విజయమ్మ షేర్ హోల్డర్‌గా ఉన్నారు. వైఎస్ హయాంలోనే పల్నాడులో సరస్వతి పవర్‌కు భూములు కేటాయించారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక లీజు పొడిగించుకున్నారు. అలాగే.. కృష్ణా నది నుంచి నిరంతరం నీటి సరఫరా ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు ఫ్రాన్స్‌కు చెందిన వీఐసీఏటీ సంస్థ భారతీ సిమెంట్స్‌లో రూ.5 వేల కోట్లతో 51 శాతం షేర్లు కొనుగోలు చేసింది. మిగిలిన 49 శాతం షేర్లలో జగన్‌కు, షర్మిలకు వాటాలున్నాయి. అయితే, షర్మిలకు ఇవ్వాల్సిన వాటా కూడా జగన్ ఇవ్వలేదు. ఆ తర్వాత కుటుంబ ఆస్తులు పంచుకున్న క్రమంలో సరస్వతి పవర్‌లో జగన్ తల్లి విజయలక్ష్మికి 100 శాతం వాటా వచ్చింది. దీనికి బదులుగా జగన్‌కు బెంగళూరులో ఆస్తులు దక్కాయి. అయితే, మొత్తం సరస్వతి షేర్లు తానే దక్కించుకోవాలన్న ఉద్దేశంతో జగన్ సొంత కుటుంబ సభ్యులపైనే కుట్రకు తెరదీశారు’’ అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News