Share News

Mega PTM: 2.28 కోట్ల మందితో మెగా పీటీఎం 2.0

ABN , Publish Date - Jun 27 , 2025 | 06:21 AM

మెగా పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌ పీటీఎం 2.0ను జూలై 5న నిర్వహించాలని నిర్ణయించినట్లు సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. 61,135 విద్యాసంస్థల్లో 2,28,21,454 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని వెల్లడించారు.

Mega PTM: 2.28 కోట్ల మందితో మెగా పీటీఎం 2.0

  • జూలై 5న నిర్వహణకు నిర్ణయం

అమరావతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మెగా పేరెంట్‌- టీచర్స్‌ మీటింగ్‌(పీటీఎం)-2.0ను జూలై 5న నిర్వహించాలని నిర్ణయించినట్లు సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. 61,135 విద్యాసంస్థల్లో 2,28,21,454 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. 74.96 లక్షల మంది విద్యార్థులు, 3.32 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.49 కోట్ల మంది తల్లిదండ్రులు, దాతలు, ఇతరులు పాల్గొంటారని పేర్కొన్నారు. దీనిపై గురువారం ఆయన మార్గదర్శకాలు విడుదల చేశారు.


పీటీఎం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యా పురోగతి, ప్రవర్తన, సామాజిక సమస్యల అవగాహన వంటి అంశాలను టీచర్లు నేరుగా తల్లిదండ్రులకు వివరించే అవకాశం ఏర్పడుతుందన్నారు. గతేడాది మొదటిసారి మెగా పీటీఎం జరిగిందన్నారు. ఈ మెగా పీటీఎంలో విద్యార్థుల హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డులను తల్లిదండ్రులకు అందిస్తారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలల పనితీరు, మౌలిక సదుపాయాలు, వాటిలో లోపాలు, కార్యాచరణ ప్రణాళికలను వివరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగా కుటుంబ ఫొటో బూత్‌లు, డ్రీమ్‌ వాల్స్‌, పాజిటివ్‌ పేరెంటింగ్‌ సెషన్లు, అమ్మ పేరుతో మొక్క నాటడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని మార్గదర్శకాల్లో వివరించారు.


పాఠశాలల పనివేళల్లో సమావేశాలొద్దు

  • డైరెక్టర్‌ విజయరామరాజు ఆదేశాలు

పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుంచి 4 గంటల వరకు ప్రధానోపాధ్యాయులతో ఎలాంటి సమావేశాలు నిర్వహించొద్దని ఆర్జేడీలు, డీఈవోలు, డీవైఈవోలను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తరగతులు నిర్వహించే సమయంలో సమావేశాలు పెట్టడం వల్ల బోధనకు అంతరాయం కలుగుతోందన్నారు. ఇది విద్యార్థుల అభ్యసనంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. అందువల్ల ఇకపై పాఠశాలల పనివేళల అనంతరం మాత్రమే సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

Updated Date - Jun 27 , 2025 | 06:22 AM