Share News

SIT Harassment: సిట్‌ అధికారులు హింసించారు

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:05 AM

మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులపై ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ గన్‌ మ్యాన్‌ మదన్‌ రెడ్డి పలు ఆరోపణలు చేశారు.

SIT Harassment: సిట్‌ అధికారులు హింసించారు

  • డీజీపీకి చెవిరెడ్డి గన్‌ మ్యాన్‌ లేఖ.. మమ్మల్నే ఆయన బెదిరించారు

  • మదన్‌ రెడ్డి ఆరోపణలు అవాస్తవం.. హక్కుల ఉల్లంఘన జరగలేదు: సిట్‌

అమరావతి/చంద్రగిరి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులపై ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ గన్‌ మ్యాన్‌ మదన్‌ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. సాక్షిగా విచారణకు పిలిచి తనను హింసించారని.. ఒత్తిడికి గురిచేశారని, పిడిగుద్దులు గుద్దారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తాకు లేఖ రాశారు. అయితే, మదన్‌ రెడ్డి చేసిన ఆరోపణలను సిట్‌ అధికారులు ఖండించారు. విచారణలో తాము హక్కుల ఉల్లంఘనలకు పాల్పడలేదని ఓ ప్రకటనలో తెలిపారు.

మదన్‌ లేఖ ఇదీ..

సిట్‌ అధికారులు.. తాము చెప్పినట్లు రాసి, సంతకాలు పెట్టమంటూ తనను మానసికంగా, శారీరకంగా హింసించారంటూ మదన్‌రెడ్డి డీజీపీకి లేఖ రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘నేను సాక్షిగా వచ్చా. నాకు తెలిసిన వాస్తవాలు రాసిస్తానని చెప్పడంతో వారు తిట్టారు. చెవిరెడ్డి మద్యాన్ని ప్రోత్సహించరని, కనీసం ఎన్నికలలో కూడా లిక్కర్‌ ఇవ్వరని చెప్పా. మళ్లీ మరుసటి రోజు విచారణకు రమ్మన్నారు. నా గదికి వచ్చి బెడ్‌పై కూర్చోగానే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయా. ఆ తర్వాత విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రికి వెళ్లి చేరా. గత మూడు రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకొంటున్నా. సిట్‌ విచారణకు ఒంటరిగా వెళ్లలేను’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.


ఇదంతా డ్రామా: సిట్‌

మదన్‌ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సిట్‌ ఖండించింది. ఆయనే తమను బెదిరించినట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘మూడున్నర వేల కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో కీలక నిందితుడైన రాజ్‌ కసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి డబ్బులు తీసుకున్నట్లు మావద్ద ఉన్న ఆధారాల మేరకే చెవిరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్ని విచారిస్తున్నాం. ఈ క్రమంలోనే మదన్‌ రెడ్డిని పిలిచి ప్రశ్నించాం. విచారణకు సహకరించకపోగా ‘మీ అందరి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ మమ్మల్నే బెదిరించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 200 మందికి పైగా నిందితులు, అనుమానితులు, సాక్షులు, వ్యాపారులు, ఎక్సైజ్‌ అధికారులను పిలిచి విచారించాం. ఎక్కడా మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌ రెడ్డిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. ఆయన చెబుతున్నదంతా ఓ డ్రామా. ఏపీఎ్‌సబీసీఎల్‌ మాజీ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి బాలాజీని నిర్బంధించారంటూ కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడం వెనుక దర్యాప్తును నీరుగార్చే కుట్ర ఉంది. ఇలా చేస్తున్న వ్యక్తుల ముసుగు తొలగించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని సిట్‌ వివరించింది. నిజాలు నిగ్గుతేల్చి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు లేఖ రాయనున్నట్టు సిట్‌ తెలిపింది.


హైకోర్టులో మదన్‌ పిటిషన్‌.. విచారణ నేటికి వాయిదా

మద్యం కుంభకోణం కేసులో సిట్‌ అధికారులు తనను చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంటూ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘మద్యం కేసులో సాక్షిగా ఈ నెల 10న సిట్‌ ముందుకు హాజరైన పిటిషనర్‌ను.. కొంతమంది నాయకులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ అధికారులు ఒత్తిడికి గురిచేశారు. దీంతో పిటిషనర్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు 15 రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.’’ అని వివరించారు. పిటిషనర్‌ను విచారించే సమయంలో న్యాయవాదిని అనుమతించేలా సిట్‌ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. హరినాథ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ స్పందన కోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

Updated Date - Jun 18 , 2025 | 05:08 AM