Prakasam District: ప్రేమ జంట ఆత్మహత్య
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:45 AM
ప్రేమ వివాహానికి పెద్దలు ససేమిరా అనడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల...

పెద్దలు పెళ్లికి అంగీకరించలేదనే
ప్రకాశం జిల్లాలో చెట్టుకు ఉరి
స్వగ్రామం నంద్యాల జిల్లా మాధవరం
ప్యాపిలి, కొమరోలు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రేమ వివాహానికి పెద్దలు ససేమిరా అనడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన కంబగిరి రాముడు(24), భారతి(22) కూలి పనులకు వెళ్లే క్రమంలో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. ఏడాదిగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే భారతికి రెండేళ్ల క్రితం మండలంలోని అలేబాదు గ్రామానికి ఓ వ్యక్తితో వివాహమైంది. కుటుంబ కలహాలతో భర్తను వదిలేసి ఏడాదిగా పుట్టింట్లో ఉంటోంది. రాముడు అవివాహితుడు, లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిమధ్య పరిచయమై ప్రేమకు దారి తీసింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో శుక్రవారం ఇరువురూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మోటార్ సైకిల్‌పై శనివారం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామానికి చేరుకున్నారు. రేగలగడ్డ చెరువు సమీపంలో వేపచెట్టుకు ఉరేసుకొని మరణించారు. ఆత్మహత్యకు ముందు రాముడు వాట్సా్‌పలో తమ్ముడికి లోకేషన్ షేర్ చేసి సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఆదివారం తెల్లవారుజామున మృతదేహాలను పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.