Kurnool: బాబోయ్ చిరుతలు..
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:11 AM
కర్నూలు జిల్లాలో ఆదివారం రెండు చిరుతలు కలకలం రేపాయి. కోసిగిలోని పులికనుమ ప్రాజెక్టు సమీపంలోని బసవన్న కొండ దగ్గరలోని ఎర్రవంకలో ఓ చిరుతపులి గాండ్రిస్తూ.. నడవలేని స్థితిలో ఉంది.

కర్నూలు జిల్లాలో కలకలం
బంధించే క్రమంలో యువకుడిపై దాడి చేసిన ఓ చిరుత
కోసిగి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో ఆదివారం రెండు చిరుతలు కలకలం రేపాయి. కోసిగిలోని పులికనుమ ప్రాజెక్టు సమీపంలోని బసవన్న కొండ దగ్గరలోని ఎర్రవంకలో ఓ చిరుతపులి గాండ్రిస్తూ.. నడవలేని స్థితిలో ఉంది. అది విన్న రైతులు ముందు ఆ చిరుతను చూసి భయపడి గ్రామంలోకి పరుగులు తీశారు. అయితే ఎంత సేపటికీ చిరుత ఉన్న చోట నుంచి ముందుకు కదలకపోవడంతో ఎస్‌ఐ హనుమంతరెడ్డికి, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ, డీఎఫ్‌వో శ్యామల, డీఎఫ్‌వో ఫ్లయింగ్ స్క్వాడ్ శ్రీనివాసులు, ఆదోని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ తేజశ్విని, బీట్ ఆఫీసర్ అనూరాధతో పాటు సిబ్బంది అక్కడ చేరుకున్నారు. అటవీ సిబ్బందితో పాటు యువకులు చిరుతను బంధించే క్రమంలో ఓ యువకుడిపై చిరుత దాడి చేసింది. దీంతో ఆ యువకుడి గాయాలయ్యాయి. చివరకు ఆ చిరుతను బంధించి ఆదోనికి తరలించారు. శ్రీశైలం నుంచి వైద్యులు వచ్చిన తర్వాత పరిశీలిస్తారని, అనంతరం వారి సూచనల మేరకు తిరుపతి జూపార్క్‌లో గానీ, శ్రీశైలం నల్లమల అడవిలో గానీ వదులుతామని అటవీ అధికారులు చెప్పారు. అలాగే మరో చిరుత బసవన్న కొండపై చాలా సేపు అటూ ఇటు తిరిగి కొండలోకి వెళ్లిపోయింది. ఒకే రోజు రెండు చిరుత పులులు కనిపించడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.