Share News

Land Acquisition: భూ సేకరణపై అడుగు ముందుకే

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:34 AM

ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీ కోసం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది..

Land Acquisition: భూ సేకరణపై అడుగు ముందుకే

మొత్తం 20వేల ఎకరాల సేకరణే లక్ష్యం

  • రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్‌, ఇండోసోల్‌కు కలిపి...

  • స్పెషల్‌ కలెక్టర్‌తో ప్రత్యేక కార్యాలయం

  • డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఐదు బృందాలు

  • జీవో జారీ చేసిన ప్రభుత్వం

కందుకూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీ కోసం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా భూములు సేకరించడంతోపాటు... బీపీసీఎల్‌, ఇండోసోల్‌ సోలార్‌ ప్లాంటుకోసం కూడా భూములు సేకరించనుంది. మొత్తం 20వేల ఎకరాల భూసేకరణ లక్ష్యంగా స్పెషల్‌ కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయనుంది. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ల సారథ్యంలో భూసేకరణ కోసం ఐదు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అత్యవసర జీవో జారీ చేసింది. భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అలాగే... కరేడులో రైతులను శాంతింపజేసి, వారు భూములు ఇచ్చేందుకు అంగీకరించేలా మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

వైసీపీ రాజకీయం...

కరేడులో భూసేకరణకు వ్యతిరేకంగా పార్టీలు, కులమతాలకు అతీతంగా ఉద్యమిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ఎవరికి వారు ఉద్యమ ఫలాలను తమ ఖాతాలో జమచేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. ఇండోసోల్‌ కంపెనీకి తెర వెనుక నుంచి మద్దతు ఇస్తున్న వైసీపీ... ఒకవైపు కరేడులో రైతుల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు ఉద్యమాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ నేతృత్వంలో 20 మంది రైతు ప్రతినిధులు వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. ఇండోసోల్‌కు మనం వ్యతిరేకం కాదని, వారికి ముందుగా కేటాయింపులు చేసిన చేవూరు, రావూరు పరిధిలోనే భూములు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఉద్యమం కొనసాగించాలని జగన్‌ సూచించినట్లు సమాచారం. ఉద్యమానికి వైసీపీ రాజకీయ రంగు పులమడంతో... జగన్‌ను కలిసిన ప్రతినిధులతో కలిసి పనిచేసేందుకు టీడీపీ శ్రేణులు వెనుకాడుతున్నారు. మరోవైపు సీపీఎం, సీపీఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఎవరికి వారే ఉద్యమాన్ని తమ ఖాతాలో వేసుకోవాలన్న ధోరణిలో వెళ్తున్నాయని... ఇది తమ ఐక్యతను దెబ్బతీస్తుందని కరేడు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 17 , 2025 | 04:34 AM