Sub Collector: రైతులను సంతృప్తి పరిచాకే ఇండోసోల్‌కు భూసేకరణ
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:33 AM
ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో భూసేకరణ ప్రక్రియను అక్కడి రైతులకు అర్థమయ్యేలా..

కరేడు గ్రామ ప్రజలందరి సహకారంతోనే ముందుకెళ్తాం
‘ఆంధ్రజ్యోతి’తో కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ
(కందుకూరు-ఆంధ్రజ్యోతి): ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో భూసేకరణ ప్రక్రియను అక్కడి రైతులకు అర్థమయ్యేలా వారి సందేహాలు నివృత్తిచేసి, ప్రజల సహకారంతోనే ముందుకు వెళతామని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమాణి శ్రీపూజ చెప్పారు. కొందరిలో భూములకు సరైన ధర రాదన్న ఆందోళన, మత్స్యకారుల్లో చేపల వేటకు అవకాశం ఉండదేమోనన్న భయాందోళన, కొన్ని కాలనీలు ఖాళీ చేయాల్సి ఉన్నందున వారికి ఎక్కడ పునరావాసం చూపిస్తారోనన్న సందేహం నెలకొన్నాయని తెలిపారు. వీటన్నిటికీ స్పష్టమైన హామీలు ఇవ్వడం, వారిలో నమ్మకం కల్పించి, వారి ఆమోదంతోనే భూసేకరణ ప్రక్రియను కొనసాగించనున్నట్లు చెప్పారు. రైతుల ఆందోళనలు, వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించామని, ఈ సమస్యపై ఉన్నతస్థాయిలోనూ చర్చ జరుగుతోందని వివరించారు. కరేడులో భూసేకరణను గ్రామం యావత్తూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఆందోళన బాటపట్టడం, భూములు ఇచ్చేదిలేదని గ్రామసభల్లోనూ ఏకగ్రీవ తీర్మానం చేసిన నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ అడిగిన పలు ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఆమె మాటల్లోనే...
కరేడులో భూసేకరణ ప్రక్రియపై తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది కదా!
ప్రస్తుతానికి భూసేకరణ ప్రక్రియ యథావిధిగా నడుస్తోంది. రైతులకు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చి వారి సహకారంతోనే భూసేకరణ ప్రక్రియను కొనసాగిస్తాం.
భూములు ఇచ్చేదిలేదని గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు కదా!
ఈ సమస్యపై ఉన్నతస్థాయిలో కూడా చర్చ జరుగుతోంది.
రైతులంతా వ్యక్తిగతంగా మీకు అర్జీలు అందజేశారా?
573 మంది రైతులు అర్జీలు ఇచ్చారు. ప్రతిఒక్కరికీ వ్యక్తిగతంగా వారు తెలిపిన అభ్యంతరానికి భూసేకరణ అధికారి సమాధానం పంపిస్తాం.
భూముల ధర ఎలా నిర్ణయించారు?
మెట్ట, మాగాణి భూమికి రూ.15 లక్షలు, తోటలకు రూ.17 లక్షలు, జాతీయ రహదారి పక్కనుండే భూములకు రూ.60 లక్షలు పరిహారం అందే అవకాశం ఉంది. అయితే మూడేళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్ల ఆధారంగా సేల్‌వాల్యూలను చూసి సరాసరి చేసి రైతుల అభీష్టంమేరకు కొంత నెగోషియేట్ చేసి ధర నిర్ణయించే అవకాశం ఉంటుంది.