రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకోత్సవం
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:10 AM
మంత్రాలయంలో రాఘవేంద్రుని స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు.
మంత్రాలయం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయంలో రాఘవేంద్రుని స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు. రాఘవేంద్రస్వామి మఠంలో బుధవారం కార్తీక అష్టమి శుభదినాన్ని పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు కవచంతో చూడముచ్చటగా అలంకరించారు. రాఘవేంద్రస్వామి బృందావన ప్రతిమను స్వర్ణపల్లకిలో అధిష్ఠించి రమణీయంగా ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో మంత్రాలయం కిక్కిర్సింది.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పరమ గురువులైన పూర్వపు పీఠాధిపతులు రఘునందన తీర్థుల మఽధ్యారాధన మహోత్సవాలు కన్నుల పండువుగా నిర్వహించారు. కర్ణాటక లోని హంపిలో వెలసిన రఘునందన తీర్థుల బృందావనానికి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేశారు. బృందావనానికి నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం, విశేష పంచామృతాభిషేకం నిర్వహించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు, పట్టు వస్ర్తాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారికి హస్తోదకం చేసి పీఠాధిపతి మహా మంగళ హారతి ఇచ్చారు. అక్కడే సంస్థాన పూజలో భాగంగా మూలరాములకు బంగారు నాణేలతో అభిషేకం చేశారు. వాదిరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాష్ ఆచార్, రాజా ఎస్ అప్రమేయాచార్.పవన్ఆచార్, మురళిస్వామి పాల్గొన్నారు.