మార్గదర్శకాలను అన్వేషించాలి: కలెక్టర్
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:07 AM
పీ-4సర్వే ద్వారా గుర్తించిన 43,021 బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శకాలను అన్వేషించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పీ-4సర్వే ద్వారా గుర్తించిన 43,021 బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శకాలను అన్వేషించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్‌లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నతస్థాయి వ్యక్తులను గుర్తించి మార్గదర్శులుగా నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లా అధికారులు కూడా మార్గదర్శ కుటుంబాలను స్ఫూర్తిగా తీసుకొని బంగారు కుటుంబాలకు చేయూతనివ్వాలని సూచించారు. అందులో భాగంగానే రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధులు, సభ్యులు చెంచుకుటుంబాలను ప్రోత్సహించేందుకు ముందుకువచ్చారని తెలిపారు. జిల్లా కేంద్రంలో కెనాల్ కాంపౌండ్‌లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ ఆవరణలో రక్తనిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీలో రూ.వెయ్యి చెల్లిస్తే జీవితకాల సభ్యత్వం ఉంటుందన్నారు. జిల్లా అధికారులందరూ శాశ్వత సభ్యత్వం పొందాలని కోరారు. ఆప్కా్‌సకు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవడానికి అధికారులు నేరుగా ఫైల్‌ను జిల్లా ఇన్‌చార్జి మంత్రికి పంపుతున్నారని అలాకాకుండా తననుంచి ఫైల్ పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కిశోర్ వికాసం ప్రత్యేక కార్యక్రమంపై అవగాహన కల్పించి బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మే 2వ తేదీనుంచి జూన్ 12వరకు 12రకాల థీమ్స్‌తో కిశోర్ వికాసం ప్రత్యేక కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని ఆదేశించారు.
ఉపాధి వేతనదారులకు లక్ష పనిదినాలు కల్పించాలని కేటాయించిన లక్ష్యాలపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కమాండ్ కంట్రోల్‌రూమ్‌లోని ఎన్‌ఐసీ వీడియోకాన్ఫరెన్స్ హాల్‌లో ఉపాధిహామీ లక్ష్యాలపై వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు.
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
నేషనల్ ఎలిజిబులిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) యూజీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్‌లో నీట్ పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్షాసమావేశం ఆమె నిర్వహించారు. మే 4వ తేదీన జరిగే నీట్ పరీక్షకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల, టెక్కెలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తదితర కళాశాలలను పరీక్షాకేంద్రాలుగా ఏర్పాటు చేశామని, ఈ పరీక్షకు 1172మంది విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులను ఉదయం 11నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో మెడికల్ క్యాంప్‌లు, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు, తాగునీటి వసతి కల్పించాలన్నారు. కేంద్రాల్లో అవసరమైన టేబుళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షాకేంద్రాలవద్ద 144సెక్షన్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.