Share News

Health Minister: కేన్సర్‌ రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు

ABN , Publish Date - Apr 20 , 2025 | 05:30 AM

కర్నూలు స్టేట్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో రూ.29 కోట్లతో లీనియర్‌ యాక్సిలరేటర్‌, సీటీ సిమ్యులేటర్‌, ఆపరేషన్‌ థియేటర్లు ప్రారంభం. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించే ప్రకటన చేశారు

Health Minister: కేన్సర్‌ రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు

  • వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ వెల్లడి

  • కర్నూలులోని స్టేట్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో లీనియర్‌ యాక్సిలరేటర్‌ ప్రారంభం

  • సీటీ సిమ్యులేటర్‌, ఆపరేషన్‌ థియేటర్లు కూడా..

  • రూ.29 కోట్లతో నూతన సదుపాయాల ఏర్పాటు

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): కేన్సర్‌ రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. కర్నూలు స్టేట్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో రూ.29 కోట్లతో ఏర్పాటు చేసిన లీనియర్‌ యాక్సిలరేటర్‌, సీటీ సిమ్యులేటర్‌, ఆపరేషన్‌ థియేటర్లను శనివారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ 120 పడకల సామర్థ్యం గల స్టేట్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 2019లో శంకుస్థాపన జరిగిందని, అయితే గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు తాత్సారం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో రాష్ట్రస్థాయి స్టేట్‌ కేన్సర్‌ ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రత్యేకించి వైద్య రంగానికి 15వ ఆర్థిక సంఘం కింద నిధులు వస్తున్నాయని చెప్పారు. కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో ఏపీకి చెందిన రోగులే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో కేన్సర్‌ వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు ఎన్‌సీడీ కింద 3.0 స్ర్కీనింగ్‌ను ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. 1-2 శాతం కొరత ఉన్న పరికరాలు, సౌకర్యాలు కల్పించి రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో స్టేట్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సేవలు అందిస్తామన్నారు. 2022లో రాష్ట్రంలో 73 వేల కొత్త కేన్సర్‌ కేసులు వెలుగు చూడగా.. అందులో 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభం కాలేదని, కూటమి ప్రభుత్వం తక్షణమే రూ.45 కోట్ల విలువైన పరికరాలను సమకూర్చిందని తెలిపారు.


అనంతరం మంత్రి సత్యకుమార్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌తో కలిసి కర్నూలు జీజీహెచ్‌లోని సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో ఉన్న క్యాత్‌ల్యాబ్‌, సీటీ సర్జరీ విభాగాలను పరిశీలించారు. తర్వాత కర్నూలు మెడికల్‌ కాలేజీలో వైద్యులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం, కోడుమూరు, ఆదోని ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, పార్థసారధి, ఏపీఎంఎ్‌సఐడీసీ చైర్మన్‌ చల్లపల్లి శ్రీనివాస్‌, అకడమిక్‌ డీఎంఈ డా.రఘునందన్‌, కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 05:31 AM