Share News

CM chandrababu: కుప్పం దా..రుణంపై సీఎం సీరియస్‌

ABN , Publish Date - Jun 18 , 2025 | 04:02 AM

చిత్తూరు జిల్లా కుప్పంలో భర్త చేసిన అప్పునకు భార్యను చెట్టుకు కట్టేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠను ఆదేశించారు.

CM chandrababu: కుప్పం దా..రుణంపై సీఎం సీరియస్‌

  • మహిళను కట్టేసిన వారిపై కఠిన చర్యలు

  • రూ.5 లక్షల తక్షణ సాయం.. ఫోన్‌లో పరామర్శ

కుప్పం, అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పంలో భర్త చేసిన అప్పునకు భార్యను చెట్టుకు కట్టేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠను ఆదేశించారు. బాధిత మహిళ శిరీషకు ఫోన్‌ చేసి పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు తక్షణ సాయంగా ప్రకటించారు. కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప చాలామంది దగ్గర అప్పులు చేశాడు. ఇదే గ్రామానికి చెందిన మునికన్నప్ప తాను అప్పుగా ఇచ్చిన రూ. 80 వేలు కోసం ఒత్తిడి చేయడంతో తిమ్మరాయప్ప పరారయ్యాడు. ఆ తర్వాత శిరీష తన ముగ్గురు బిడ్డలను రామకుప్పం మండలం కెంచనబల్ల గ్రామంలోని పుట్టింట్లో ఉంచారు. వారిని అక్కడి పాఠశాలలో చేర్చి తాను బెంగళూరు చేరుకుని దొరికిన పని చేసుకుని బతుకుతోంది. ఈ క్రమంలో తన చిన్న కుమారుడు అభి టీసీకోసం సోమవారం నారాయణపురం వచ్చిన శిరీషను మునికన్నప్ప చెట్టుకు కట్టేసి వేధించడం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, సీఎం ఆదేశాలతో మునికన్నప్పతోపాటు ఆయన భార్య వెంకటమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరిలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, నలుగురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిరీషతో ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. తక్షణ సాయంగా రూ.5 లక్షలు ఇస్తామన్నారు. హోం మంత్రి అనిత కూడా వీడియో కాల్‌లో ఆమెతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ సైతం జిల్లా ఎస్పీతో మాట్లాడి నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు టీడీపీ నాయకులు సైతం బాధితురాలిని పరామర్శించారు. ఆమె ముగ్గురు పిల్లల చదువుకు ప్రభుత్వ సాయం అందేలా చూస్తామన్నారు. జరిగిన ఘటనకు, రాజకీయాలకు సంబంధం లేదని కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. అప్పు ఇచ్చిపుచ్చుకోవడంలో జరిగిన తేడా వల్లే ఇది చోటు చేసుకుందని వివరించారు.

పసుపుతాడు తప్ప ఏమీలేదు: శిరీష

ఇదిగో.. మెడలో ఉన్న పసుపుతాడు తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. ఆయన (భర్త) అప్పులు చేసి తీర్చలేక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ముగ్గురు బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నా. అందుకోసం బెంగళూరులో కూలిపనులు చేస్తున్నా. నన్ను చెట్టుకు కట్టేసి చావబాదారు. నా కొడుకు మా అమ్మను కొట్టొద్దని ఏడుస్తుంటే పక్కకు తోసేశారు. ఊళ్లో 200 మంది చూస్తూ ఉన్నారు. ఎవరూ పట్టించుకోలేదు. నా భర్త అప్పులు చేసింది నిజమే. రూ.80 వేల అప్పునకు పత్రం రాయించి నాచేత బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు. నిదానంగా తీరుస్తానని చెప్పినా వినకుండా గొడ్డును బాదినట్లు బాదారు. నాకు న్యాయం కావాలి. నా బిడ్డలకు ఆదరువు కావాలి.

Updated Date - Jun 18 , 2025 | 04:07 AM