Sunita Reddy: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన సునీతా రెడ్డి.. తండ్రి హత్యపై ఫిర్యాదు..
ABN , Publish Date - Mar 15 , 2025 | 07:26 PM
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‍ను మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సాయంత్రం విజయవాడ రాజ్ భవన్‍కు వెళ్లిన సునీత.. తన తండ్రి హత్యకేసుపై గవర్నర్‍కు ఫిర్యాదు చేశారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazir)ను మాజీమంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) కుమార్తె సునీత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ (శనివారం) సాయంత్రం విజయవాడ రాజ్‍భవన్(Raj Bhavan)కు వెళ్లిన సునీత రెడ్డి(Sunita Reddy).. తన తండ్రి హత్య కేసుపై గవర్నర్‍కు ఫిర్యాదు చేశారు. వివేకాను అతి కిరాతంగా హత్య చేశారని, ఈ కేసులో తనకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసేలా చూడాలని కోరారు. హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకూ జరిగిన పరిణామాలను గవర్నర్‌కు వివరించారు.
కాగా, ఈరోజు వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా ముందుగా పులివెందులలో సునీత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరిగా అనుమానాస్పద స్థితిలో మృతిచెందుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హత్య జరిగి ఆరేళ్లు గడిచిపోయాయని, అయినా కేసు మాత్రం కొలిక్కి రాలేదంటూ సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత సమయం గడిచినా సీబీఐ కోర్టులో కనీసం ట్రయస్ కూడా ప్రారంభం కాలేదని విమర్శించారు.
ఈ కేసును సీబీఐ తిరిగి దర్యాప్తు చేపట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు సునీత. అయితే కేసు దర్యాప్తును అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆరోపించారు. వివేకాను చంపిన నిందితుల్లో ఒక్కరు మినహా అందరూ బెయిల్‍పై బయటే తిరుగుతున్నారని, సాక్షులు మాత్రం చనిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షులను వాగ్మూలం వెనక్కి తీసుకోవాలంటూ నిందితులు హడలెత్తిస్తున్నారని సునీత చెప్పుకొచ్చారు. ఇన్నేళ్లయినా తమ కుటుంబానికి న్యాయం జరగడం లేదని, నిందితులకు కఠిన శిక్ష పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Seethakka: నా ఫొటోలు మార్ఫింగ్ చేశారు.. ఇక వదిలేది లేదంటూ మంత్రి మాస్ వార్నింగ్..
CM Chandrababu Naidu: రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..