Share News

Machilipatnam Violence: ఏడుగురు వైసీపీ నేతలు అరెస్ట్.. ఎందుకంటే..

ABN , Publish Date - Jul 18 , 2025 | 09:51 PM

మచిలీపట్నంలో ఇటీవల రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Machilipatnam Violence: ఏడుగురు వైసీపీ నేతలు అరెస్ట్.. ఎందుకంటే..
Machilipatnam Violence

అమరావతి: వైసీపీ నేతల అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతల (Machilipatnam Violence) మధ్య ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) మచిలీపట్నం పర్యటన సందర్భంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగాయి. ఈ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత బొడ్డు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీసులు 19 మంది వైసీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా ఏడుగురిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు సిద్ధమవుతున్నారు.


మాజీ మంత్రి కుమారుడు కూడా..

అరెస్ట్ అయిన వారిలో మేకల సుబ్బన్న, గూడవల్లి నాగరాజు, నోబుల్ థామస్, కొలుసు హరిబాబు, తుమ్మలపల్లి జగన్నాథరావు, బాబావలీ, తిరులమలశెట్టి వరప్రసాద్‌లు ఉన్నారు. కాగా, ఇదే కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు ఏ19గా ఉన్నారు. శ్రీనివాస్ ఫిర్యాదులో వైసీపీ నేతలు హోంమంత్రి పర్యటన సమయంలో ఉద్దేశపూర్వకంగా అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు వేగంగా స్పందించి, కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఈ ఘటనతో మచిలీపట్నంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.


వైసీపీ నేతలు మాత్రం..

ఈ అరెస్టులు స్థానికంగా వివాదాస్పదంగా మారాయి. వైసీపీ నేతలు ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. మరోవైపు, టీడీపీ నాయకులు ఈ చర్యలు చట్టపరమైనవని, శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమని వాదిస్తున్నారు. పోలీసులు మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అరెస్ట్ అయిన నేతలను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 10:15 PM