Parakamani Case: తిరుమల పరకామణి కేసు.. మరోసారి సీఐడీ ముందుకు ధర్మారెడ్డి
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:08 PM
తిరుమల పరకామణి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈకేసులో పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని సీఐడీ మరోసారి విచారణకు పిలిచింది.
అమరావతి, నవంబర్ 26: తిరుమల పరకామణి చోరీ కేసులో (Tirumala Parakamani Case) సీఐడీ విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి (TTD Former EO Dharma Reddy) హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ పిలుపు మేరకు.. ఈరోజు (బుధవారం) విజయవాడ తులసినగర్‌లోని సీఐడీ కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణకు వచ్చారు. టీటీడీ మాజీ ఈవోను సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు. పరకామణి కేసులో ఇప్పటికే రెండు సార్లు ధర్మారెడ్డిని సీఐడీ విచారించిన విషయం తెలిసిందే. ఇక నిన్న ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని మరోసారి సీఐడీ విచారణకు పిలిచింది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీటీడీ పరకామణి కేసులో దర్యాప్తు అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి గత ఈవోలు, ఛైర్మన్లను అధికారులు విచారించారు. ప్రస్తుతం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీఐడీ మూడో సారి ప్రశ్నిస్తోంది. ప్రధానంగా పరకామణిలో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని రక్షించేందుకు గత ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులే దగ్గరుండి వ్యవహారాన్ని నడిపించారని, చివరకు కేసు పెట్టినా కూడా లోక్‌అదాలత్‌లో కొట్టివేసే విధంగా ఒత్తడి తెచ్చారని, దీనికి సంబంధించి లక్షల్లో చేతులు మారాయనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని కోణాల్లో దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు.
గతంలో ధర్మారెడ్డిని రెండు సార్లు విచారించిన సీఐడీ అధికారులు.. ఆయన చెప్పిన విషయాలను రికార్డ్ చేశారు. అలాగే టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ మరణం కూడా మిస్టరీగా మారింది. దీంతో పరకామణి వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి.. ఎవరెవరు ఇందులో పాత్రధారులుగా ఉన్నారు?.. ఎవరెవరు ఏ అంశాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారనే అంశాలపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం.. అన్నీ తామై నడిపిస్తున్న విద్యార్థి ప్రతినిధులు
భూమన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయ్: భానుప్రకాష్
Read Latest AP News And Telugu News