Patel Jayanti Vijayawada Rally: పటేల్ కలలు సాకారం కోసమే సమైక్యత పరుగు: మాధవ్
ABN , Publish Date - Oct 31 , 2025 | 01:05 PM
దేశంలో ఉన్న 560 సంస్థానాలను కలిపి భారతదేశం అంతా ఒకటిగా చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మాధవ్ పేర్కొన్నారు. స్వాతంత్రం తర్వాత కూడా ఆయన నిరంతర కృషితో ప్రజల కోసం, దేశం కోసం పనిచేశారన్నారు.
విజయవాడ, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి (Sardar Vallabhbhai Patel Jayanti) సందర్భంగా విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. ఈరోజు (శుక్రవారం) ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (AP BJP Chief PVN Madhav) , ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shivanath), ఇతర నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ... దేశాన్ని ఒక్కటిగా చేసిన మహనీయుడు సర్దార్ పటేల్ అని కొనియాడారు. ఆయన కలలు సాకారం చేసేలా ఆయన జయంతి రోజు సమైక్యత పరుగు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత దేశ తొలి హోమ్ మినిస్టర్‌గా పనిచేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగా భారతదేశమంతా సమైక్యంగా ఉందన్నారు. స్వేచ్ఛతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఆయన 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పటేల్‌ను స్మరిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
దేశంలో ఉన్న 560 సంస్థానాలను కలిపి భారతదేశం అంతా ఒకటిగా చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పేర్కొన్నారు. స్వాతంత్రం తర్వాత కూడా ఆయన నిరంతర కృషితో ప్రజల కోసం, దేశం కోసం పనిచేశారన్నారు. నిజాంలు స్వయం ప్రతిపత్తి కోరితే దేశమంత సమైక్యంగా ఉండాలని దేశంలో అందరూ భాగస్వామ్యం కావాలని వారికి గట్టిగా చెప్పిన వ్యక్తి పటేల్ అని చెప్పుకొచ్చారు. ఆయన నేతృత్వంలో జమ్మూకాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు కూడా కృషి చేశారని తెలిపారు. ఆనాడు నెహ్రూ తొందర పాటు నిర్ణయం వల్ల నాటి నుంచి 2019 వరకు ఆ సమస్య అలాగే ఉందన్నారు.
ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి రాగానే 370 అధికరణ కింద జమ్ము కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశారన్నారు. భారతదేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేయాలని కోరారు. లోకల్ ఫర్ వోకల్ నినాదాన్ని అందుకొని మనవారిని మనమే ప్రోత్సహించుకోవాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలని బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ పిలుపునిచ్చారు.
పటేల్ త్యాగానికి గుర్తింపుగా: ఎంపీ కేశినేని
సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం సమగ్రతను చాటారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సంస్థానాలు విలీనం చేశారన్నారు. పటేల్ త్యాగానికి గుర్తింపుగా ఏటా స్వతంత్ర దినోత్సవం మాదిరిగా ఏకతా ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. యూనిటీ మార్చ్‌ను ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సర్దార్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన నివాళులు
పాండురంగ స్వామి ఉత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
Read Latest AP News And Telugu News