Parthasarathi Criticizes YSRCP: వైసీపీవి అన్నీ కలలే.. త్వరలోనే వాస్తవాలు బయటకు
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:35 PM
నాటి వైసీపీ పాలనలో మద్యంలో కూడా హానికర పదార్థాలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. అయితే ఈరోజు మద్యం పరీక్షల్లో హానికర పదార్థాలు లేవని రిపోర్ట్ వచ్చిందని.. అది కూటమి ప్రభుత్వ నిస్పక్ష ధోరణి అని చెప్పుకొచ్చారు.
విజయవాడ, అక్టోబర్ 18: సీఎం చంద్రబాబు (CM Chandrababu ) నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి పార్థసారథి (Minister Parthasarathi) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గోబెల్స్ సిగ్గుపడేలా అభివృద్ధి జరుగుతోందన్నారు. వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. గత ఐదేళ్లు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని... ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో ఎన్నికల్లో చూశామన్నారు మంత్రి. మద్యం కుంభకోణాల్లో వాస్తవాలు బయటపడుతున్నాయని.. దీనితో కల్తీ మద్యం పేరిట డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. నాటి వైసీపీ పాలనలో మద్యంలో కూడా హానికర పదార్థాలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చిందని వెల్లడించారు. అయితే ఈరోజు మద్యం పరీక్షల్లో హానికర పదార్థాలు లేవని రిపోర్ట్ వచ్చిందని.. అది కూటమి ప్రభుత్వ నిస్పక్ష ధోరణి అని చెప్పుకొచ్చారు.
కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. టీడీపీ నేతలున్నా పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్ చేశామని అన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రభుత్వ సురక్ష యాప్ తీసుకొచ్చిందని తెలిపారు. యాప్ ద్వారా హోలో గ్రామ్ నుంచి సమాచారం తెలుసుకోవచ్చని.. దీనిపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో స్కూటర్స్‌లో మద్యం డోర్ డెలివరీ చేశారని.. నేడు నేతి బీరకాయ మాటలు చెప్పటం హాస్యాస్పదమంటూ ఎద్దేవా చేశారు. డిజిటల్ పేమెంట్స్ కే ఎక్కువ ప్రాధాన్యత అని తేల్చిచెప్పారు. ప్రభుత్వ అధికారులతో తాము మద్యం అమ్మడం లేదని స్పష్టం చేశారు. తక్కువ ధరకు లిక్కర్‌ను అన్ని నియోజకవర్గాల్లో అందిస్తున్నామని అన్నారు. బార్లలో 15 శాతం ఎక్కువ ట్యాక్స్‌తో లిక్కర్ అమ్మే దానిపై కమిటీ వేయనున్నట్లు తెలిపారు.
పీపీపీ విధానంపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో మాట్లాడేవారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కుంభకోణాలు లేకుండా పాలన సాగుతోందన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. అధికారుల మనోధైర్యం దెబ్బ తీసేలా వైసీపీ ప్రవర్తిస్తోందని విమర్శించారు. చట్టపరంగా పని చేసే అధికారులకు అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తామని కలలు కంటోందని ఎద్దేవా చేశారు. దళిత, బడుగు వర్గాల అధికారులే టార్గెట్‌గా వైసీపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ త్వరలో కల్తీ మద్యంపై వాస్తవాలు బహిర్గతం చేస్తుందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నిధుల కొరత వాస్తవమే.. అయినప్పటికీ: మంత్రి నారాయణ
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే
Read Latest AP News And Telugu News