Atchannaidu: రైతులను ఆర్థికంగా ఆదుకుంటాం.. ఇదే మా బాధ్యత: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:05 PM
రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని... ఆ బాధ్యతను తాము నిర్వహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
కృష్ణా, నవంబర్ 24: జిల్లాలోని ఘంటశాలలో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు అని తెలిపారు. రాష్ట్రంలో నూటికి 64 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారన్నారు. గత పాలకులు వ్యవసాయ రంగాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. పంట చేతికొచ్చాక ప్రతి సంవత్సరం తుఫానులు రావడంతో రైతులు నష్టానికి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలని ధృడ సంకల్పంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.
రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని... ఆ బాధ్యతను తాము నిర్వహిస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు రైతన్నా మీకోసం కార్యక్రమం పెట్టి రైతులను రోడ్డున పడేశారని ఒక వ్యక్తి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని కూడా లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏదైనా ఒక స్టేట్‌మెంట్ ఇస్తే తాటికాయ అంత అక్షరాలతో పనికిమాలిన టీవీ, పేపర్లో రాస్తారని.. వాటిని రైతులు నమ్మేస్తారని జగన్ అనుకుంటే బాధేస్తోందన్నారు. ఆ వ్యక్తి ఇప్పుడే ఆకాశం నుంచి దిగి రాలేదని.. ఆ వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలించారంటూ జగన్ ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఐదు సంవత్సరాలు వ్యవసాయాన్ని గాలికొదిలేసి రైతులను రోడ్డును పడేశారని విమర్శించారు. అలాంటి వ్యక్తి మన సీఎం చంద్రబాబును విమర్శిస్తుంటే బాధేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
శ్రీశైలం దేవస్థానం పేరిట నకిలీ వెబ్‌సైట్ కలకలం
డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఫైట్
Read Latest AP News And Telugu News