Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుఫాను.. హోంమంత్రి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 03:26 PM
దిత్వా తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, నవంబర్ 28: శ్రీలంకలో మొదలైన దిత్వా తుఫాను ఏపీని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం చేశారు. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అన్నారు.
ఎక్కడా పాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని సూచనలు చేశారు. ఈ క్రమంలో ప్రమాదకరమైన హోర్డింగ్స్‌ను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు.
కాగా.. నైరుతీ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాను కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతానికి ఇది శ్రీలంకకు 80 కిలోమీటర్ల దూరంలో, పుద్దుచ్చేరికి 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన ఆరుగంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. ఎల్లుండి (ఈనెల 30) నైరుతీ బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, పుద్దుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెల్లకూడదని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రేపు మధ్యాహ్నం నుంచి దిత్వా తుఫాను ప్రభావం కోస్తా జిల్లాల్లో, రాయలసీమలో ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
నిర్మలా సీతారామన్‌ను చూసి ఎంతో నేర్చుకోవాలి: మంత్రి లోకేష్
అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది.. టచ్ చేసింది: నిర్మలా సీతారామన్
Read Latest AP News And Telugu News