Chandrababu Cyclone Montha: కేడర్ నుంచి లీడర్ వరకు కదలి రండి.. టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:23 AM
తుపాన్ ప్రభావంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఎన్డీయే శ్రేణులు నేడు, రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచనలు చేశారు.
అమరావతి, అక్టోబర్ 28: మొంథా తుపాన్ రాష్ట్రాన్ని గడగడాలాడిస్తోంది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (మంగళవారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్ కారణంగా నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మొంథా తుపాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాకినాడకు 270 కి.మీ దూరం నుంచి 15 కి.మీ వేగంతో రాష్ట్రం వైపు వస్తోందని తెలియజేశారు.
ప్రజలను అప్రమత్తం చేయండి...
ఈ రోజు రాత్రికి సివియర్ సైక్లోన్‌గా మారి మచిలీపట్నం - కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని తెలిపారు. తుపాన్ ప్రభావంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఎన్డీయే శ్రేణులు నేడు, రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచనలు చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. పంటలను మునకనుంచి కాపాడేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధికారులకు తెలియజేశామని.. ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
అదే మా లక్ష్యం..
ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్డీయే కార్యకర్తలు స్వచ్ఛంధ సేవకులుగా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అవసరమైతే కేంద్ర సాయం కూడా కోరతామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. సంక్షోభ సమయాల్లో ప్రజల చెంతనే ఉండాలన్నారు. తుపాను సహయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్డీఏ పార్టీల యంత్రాంగం సహకరించాలని కోరారు. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణిలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తిత్లీ, హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా వ్యవహరిస్తారనే నమ్మకం ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ప్రజలకు తోడుగా ఉందాం...
మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చెట్లు, స్తంభాలు వంటివి కూలినా యుద్ధ ప్రాతిపదిన తొలగించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్య్సకారులను వెనక్కి రప్పించామని.. వారితోనూ ఎన్డీయే శ్రేణులు సమన్వయంతో ఉండాలని సూచించారు. ప్రతి గంటకు బులిటెన్ కూడా విడుదల చేస్తామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా కేడర్ నుంచి లీడర్ వరకు ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. కూటమిని ఆదరించిన ప్రజలకు తోడుగా ఉండాలని వెల్లడించారు. దాదాపు 39 నియోజకవర్గాలకు వర్ష ప్రభావం ఎక్కువగా చూపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు
హెచ్చరిక.. ఈ రాత్రి గంటకి వంద కి.మీ వేగంతో గాలులు!
Read Latest AP News And Telugu News