AP liquor scam: లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డికి మరో షాక్
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:42 PM
AP liquor scam: ఏపీలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి మరో గట్టి షాక్ ఇచ్చింది సిట్.

అమరావతి, జూన్ 18: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ38గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Former MLA Chevireddy Bhaskar Reddy) పేరును నిన్ననే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని ఏ39గా చేర్చుతూ ఈరోజు (బుధవారం) కోర్ట్‌కు మెమో పంపారు పోలీసులు. మోహిత్ రెడ్డితో పాటు మరో మాజీ ఎంపీని కూడా సాయంత్రంలోపు నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన డబ్బును చెవిరెడ్డి అందుకున్నట్టు సిట్ వద్ద ఆధారాలు ఉన్నాయి. మద్యం కమిషన్లను ఎన్నికల్లో అభ్యర్థులకు పంపిణీ చేశారని ఇప్పటికే సిట్ నిర్ధారించింది.
ఈ డబ్బు అందుకున్న చెవిరెడ్డి ఆ మొత్తాన్ని కొంతమందికి పంపిణీ చేసినట్టు సిట్ వద్ద సమాచారం ఉంది. ఇందులో కొంత చంద్రగిరి నుంచి పోటీ చేసిన తన కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చినట్టు సిట్ గుర్తించింది. మరి కొంత డబ్బును గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మరో మాజీ ఎంపీకు ఇచ్చినట్టు సిట్ వద్ద ఆధారాలు ఉన్నాయి. ఆ మాజీ ఎంపీని కూడా సాయంత్రంలోపు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశం ఉంది. కాగా.. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడును బెంగళూరులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.వారిద్దరినీ విజయవాడ తీసుకువచ్చిన అధికారులు.. సిట్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు నుంచి ప్రయాణం చేసి రావడంతో కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చిన అనంతరం చెవిరెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు చెవిరెడ్డి రెండో కుమారుడు విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. న్యాయవాదులతో కలిసి సిట్ ఆఫీస్‌కు వచ్చారు హర్షిత్ రెడ్డి. అయితే న్యాయవాదులను మాత్రమే లోనికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన సిట్.. హర్షిత్ రెడ్డికి మాత్రం అనుమతి నిరాకరించారు.
కాగా.. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణుక్య, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ అరెస్ట్ చేసి.. కస్టడీలోకి తీసుకుని విచారించింది కూడా. వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు మిథున్ రెడ్డి పాత్ర కూడా చాలా ప్రముఖంగా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఆయన హైకోర్టులో ముందస్తుగా బెయిల్ పిటిషన్ వేయడంతో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రూ.5 కోట్లు మిథున్ రెడ్డి ఖాతాలో జమచేసినట్లు సిట్ అధికారులు గుర్తించి ఆ వివరాలను హైకోర్టుకు సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కేసిరెడ్డితో మాజీ ఎమ్మెల్యే పలు దఫాలుగా సమావేశం అవడంతో పాటు ఎన్నికల ముందు కేసిరెడ్డి నుంచి కొన్ని కోట్లు తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన సమయంలో, అతడి కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో, మాజీ ఎంపీకి కూడా డబ్బులు పంపిణీ చేయడంలో చెవిరెడ్డి పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. మొత్తం విచారణ జరిపిన అనంతరం ఆధారాలు సేకరించిన సిట్.. చెవిరెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని అరెస్ట్ విజయవాడకు తీసుకువచ్చి కార్యాలయంలో విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ.. ఏంటి మ్యాటర్
నెలరోజుల తర్వాత విశాఖలో సన్నీ భయ్యా ప్రత్యక్షం
ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
Read Latest AP News And Telugu News