AP students: ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న 17 మంది ఏపీ విద్యార్థులు
ABN , Publish Date - Jun 24 , 2025 | 07:14 AM
AP News: ఇరాన్ నుంచి 17 మంది ఏపీ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల దృష్ట్యా విదేశాంగశాఖ భారత్‌కు తీసుకొస్తోంది. ఇరాన్, ఇజ్రాయిల్ నుంచి వచ్చే బాధితుల కోసం ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Delhi: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన 17 మంది విద్యార్థులు (10 Students) ఇరాన్ (Iran) నుంచి ఢిల్లీ (Delhi) చేరుకున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ (Israel) ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ శాఖ గత మూడు రోజుల నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున వచ్చిన ప్రత్యేక విమానంలో 17 మంది ఏపీ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. వారిలో 10 మందిని ఏపీ భవన్‌కు తరలించిన అధికారులు.. మిగిలిన 7గురు వారి స్వస్థలానికి బయలుదేరినట్లు వెల్లడించారు. ఇరాన్, ఇజ్రాయిల్ నుంచి వచ్చే విద్యార్థులు, బాధితుల కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. కాగా ఢిల్లీ చేరుకున్న వారిని స్వస్థలానికి పంపేందుకు ఏపీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్లు రెండు వేర్వేరు టీమ్‌లను నియమించాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ..
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఆయా దేశాల నుంచి ఆరుగురు తెలంగాణ వాసులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. వారికి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆశ్రయం కల్పించినట్లు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరుగురు తెలంగాణ విద్యార్థులు ఆదివారం అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారని, వీరిలో నలుగురు ఇరాన్ నుంచి, ఇద్దరు ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా వచ్చారని, సోమవారం హైదరాబాద్ చేరుకున్నారని తెలిపారు. తెలంగాణకు చెందిన మరో ఏడుగురు ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్‌లోని అమ్మాన్‌కు చేరుకున్నారని, వారిని ఢిల్లీకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇండియాకు ప్రత్యేక వెసులుబాటు
కాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఉధృతమవుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియాకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు వీలుగా ఇప్పటికే మూసివేసిన ఎయిర్‌స్పేస్‌ను తెరిచింది. దీంతో ఇరాన్ నగరాల్లో చిక్కుకుపోయిన సుమారు 1,000 మంది భారతీయ విద్యార్థులను 'ఆపరేషన్ సిందు' కింద ప్రత్యేక విమానాల్లో న్యూఢిల్లీకి తీసుకువస్తున్నారు.
తొలి విమానం
ఇరాన్‌లో ఉంటున్న భారతీయ విద్యార్థులతో వస్తున్న తొలి విమానం శుక్రవారం రాత్రి 11 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంది. రెండో విమానం శనివారం ఉదయం, మూడో విమానం అదేరోజు సాయంత్రం ఇండియాకు చేరాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగుతుండటంతో దాదాపు అన్ని అంతర్జాతీయ విమానాలకు ఎయిర్‌స్పేస్‌ను ఇరాన్ మూసివేసింది. అయితే ఇండియా కోసం ప్రత్యేకమైన క్యారిడార్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి తరలించేందుకు ఇరాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఇరాన్‌లో 4,000 మందికి పైగా భారతీయులు నివసిస్తుండగా, వీరిలో సగం మంది విద్యార్థులు ఉన్నారు. 'ఆపరేషన్ సిందు' కింద భారత ప్రభుత్వం 110 మంది భారతీయ విద్యార్థులను ఇప్పటికే న్యూఢిల్లీకి తీసుకువచ్చింది. వీరంతా ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకోవడంతో అక్కడి నుంచి వారిని ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చారు.
ఇవి కూడా చదవండి:
బాబోయ్.. జూలై 5న జపాన్ వెళ్లం
అంతరిక్షంలోకి పాలకొల్లు అమ్మాయి
For More AP News and Telugu News