West Godavari : అత్తకు ప్రేమతో రూ.కోటి!
ABN , Publish Date - Mar 06 , 2025 | 05:52 AM
కోనసీమలో ఓ కోడలు.. తన అత్త 50వ పుట్టినరోజు సందర్భంగా రూ.కోటి విలువజేసే బహుమతులను అందజేసి ప్రేమాభిమానాలను చాటుకుంది.

కోనసీమ కోడలు.. రూ.కోటి విలువైన బహుమతులు
అత్తాకోడళ్లంటే ఎప్పుడూ.. కట్నం తేలేదనో.. తనను సరిగ్గా చూడ్డం లేదనో తగవులాడుకోవడం చూసేఉంటాం.. వినే ఉంటాం! కానీ.. కోనసీమలో ఓ కోడలు.. తన అత్త 50వ పుట్టినరోజు సందర్భంగా రూ.కోటి విలువజేసే బహుమతులను అందజేసి ప్రేమాభిమానాలను చాటుకుంది. కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి కాసు శ్రీనివాస్, భవానీ దంపతుల కుమారుడు సుఖేష్‌కు రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రీరంగనాయకితో వివాహం జరిగింది. అప్పటినుంచి అత్తామామలు తనను కన్న తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారన్న అభిమానంతో.. అత్త భవానీ 50వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోడలు నిర్ణయించుకుంది. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అత్తకు పట్టుచీర, పసుపుకుంకుమ, గాజులు, మంగళసూత్రంతోపాటు వంద గ్రాముల బంగారు బిస్కెట్, రూ.28లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్, 50లక్షల 50రూపాయల 50పైసల నగదు కలిపి మొత్తం రూ.కోటి విలువ చేసే బహుమతులను అందించి.. గోదారోళ్లు ఏం చేసినా ప్రత్యేకమేననన్నట్లుగా కోడలు తన ప్రేమను చాటుకుంది.
-రాజోలు, ఆంధ్రజ్యోతి