Kharif Crops 2025: ఖరీఫ్ కళకళ
ABN , Publish Date - Jul 27 , 2025 | 03:04 AM
రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు కళకళలాడుతున్నాయి. నైరుతి రుతుపవనాల్లో కదలికతో అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు వరుసగా ఏర్పడడంతో పాటు బంగాళాఖాతంలో...

వర్షాలతో జీవం పోసుకున్న పైర్లు ఊపందుకున్న వరి నాట్లు... పుంజుకున్న పత్తి సాగు
10 లక్షలకు పైగా హెక్టార్లలో పంటలు
17 జిల్లాల్లో మెరుగైన వర్షపాతం
సీమలో 22శాతం నుంచి 48శాతం లోటు
నెలాఖరుకల్లా కరువు మండలాలు?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ పంటలు కళకళలాడుతున్నాయి. నైరుతి రుతుపవనాల్లో కదలికతో అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు వరుసగా ఏర్పడడంతో పాటు బంగాళాఖాతంలో వాయుగుండంతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. దీంతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. ఈనెల 17కు ముందు 37.5 శాతంగా ఉన్న వాన లోటు శనివారానికి 19.8 శాతానికి తగ్గింది. వాయుగుండం ప్రభావంతో మరో రెండు, మూడు రోజుల పాటు కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో సగటు వాన లోటు మరింత తీరనున్నది.
విశాఖ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో లోటు ఉన్నప్పటికీ వరి సాగుకు కాలువల ద్వారా నీరు సరఫరా అవుతోంది. అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 22-48ు వాన లోటు కొనసాగుతోంది. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 31.16 లక్షల హెక్టార్లలో వరి, పత్తి, మిర్చి, చిరుధాన్యాలు సహా వివిధ పంటలు సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా హెక్టార్లలో రైతులు పైర్లు వేశారు. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ పైర్లన్నీ జీవం పోసుకున్నాయి. జలాశయాలకు భారీగా వరద నీరు రావడంతో కృష్ణా, గోదావరి, వంశధార ఆయకట్టుల్లో వరి సాగుకు ప్రభుత్వం కాలువల ద్వారా నీటిని విడుదల చేసింది. ఆయా ప్రాంతాల్లో వరి సాగు ముమ్మరంగా సాగుతోంది.
కోస్తా, రాయలసీమలో పత్తి సాగు పుంజుకుంది. అయితే వర్షాలు ఆలస్యంగా పడటంతో అపరాల సాగు తగ్గింది. ప్రస్తుత వర్షాలు ఖరీఫ్ సాగుకు ఊతమిచ్చాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాయలసీమలోని కొన్ని మండలాల్లో సగటు వర్షపాతం తక్కువగా ఉండటంతో ఈ నెలాఖరు వరకూ చూసి, తర్వాత కరువు మండలాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు
లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..