ABN Special Story: అనగనగా ఒక ఊరు.. ప్రజలే లేరు..!
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:23 AM
అనగనగా ఒక ఊరు.. దాని పేరు బేల్దారివాండ్లపల్లె. పేరుకే పల్లె ఉంది.. ఆ పల్లెలో ఇళ్లు ఉన్నాయి... దేవాలయం ఉంది కానీ ప్రజలు మాత్రం లేరు. ఆ ఊరిలో సరైన వసతులు లేక.. వెళ్లేందుకు సరైన రహదారి లేక.. పాలకుల చిన్నచూపుతో మొదలైన వలసల పర్వంతో మొత్తం ఊరంతా ఖాళీ అయిపోయింది.

సుండుపల్లె, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వానరాచపల్లి ఎగువబిడికి ఎగువ భాగంలో బేల్దారివాండ్లపల్లె (చిడతలగుట్ట వడ్డిపల్లి) అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒకప్పుడు సుమారు 17 కుటుంబాలు శాశ్వత ఇంటి నిర్మాణాలు చేసుకుని జీవనం సాగించేవి. అయితే ప్రస్తుతం ఆ ఊరు ఖాళీ అయిపోయింది. ఆ ఊరు ఖాళీ అయ్యేందుకు గ్రామంలో సరైన మౌలిక వసతులు లేకపోవడమే ప్రధాన కారణ మని అక్కడి నుంచి వలస వెళ్లిన గ్రామస్థులు చెబుతున్నారు. పచ్చని చెట్లు, చుట్టూ పంట పొలాలు, పక్కనే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పెద్దగుట్ట. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణమున్న ఊరు ఎందుకు ఖాళీ చేశారని అక్కడ జీవనం చేసిన వారిని ఎవరినైనా అడిగితే అక్కడ కొలువుదీరిన సీతారాములు, గంగమ్మ తల్లిని అడగమని వాపోతున్నారు. 30 సంవత్సరాల క్రితం మొదలైన ఆ ఊరి ప్రజల వలసలు ఐదు నెలల క్రితం ఓ కుటుంబం ఆ ఊరి నుంచి చివరిగా సుండుపల్లెకు వలస రావడంతో ఆ ఊరి కథ ముగిసింది. ఇలాంటి కష్టం ఏ ఊరికి రాకూడదని ఆ ఊరిలో నివసించి కష్టాలు ఎదుర్కొన్న కుటుంబాలు వాపోతున్నాయి.
కల చెదిరింది...
సుమారు 100 సంవత్సరాల క్రితం మొదలైన ఆ ఊరి ప్రస్థానం ఐదు నెలల క్రితం ఆ ఊరిలో జరిగిన ఒక చావుతో ఆ ఊరి కల చెదిరింది. ఎన్నో ఆశలతో బేల్దారి వాండ్లపల్లె (చిడతలగుట్ట వడ్డెపల్లె) లో జీవనం సాగిం చిన ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు కనిపించలేదు. పాలకులు కరుణిస్తారని, అధికారులు ఆదుకుంటారని. ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. ఎవ్వరూ ఆదుకోలేదు. సరైన విద్యుత్, తాగునీరు, వైద్యం అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి.
పైగా ఆ ఊరికి రోడ్డు సౌకర్యం కూడా లేదు. ద్విచక్రవాహనాలు తప్ప ఆటోలు సైతం రాని ఆ ఊరి తలరాత ఇక మారదు. ఇక్కడే ఉంటే రానున్న తరాలు కూడా ఇలాగే బతకాలేమో అనే భయంతో 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కుటుంబ వలసలు ఆ ఊరిని మూగబోయేలా చేశాయి. ప్రస్తుతం ఆ ఊరిలో గతంలో నివసించిన ఆనవాళ్లు తప్ప ఇంకేమీ మిగలలేదు. ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న ఇళ్లు మూతపడ్డాయి. కొన్ని ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ ప్రజలు నివసించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఊరిలో ఉన్న సీతారాముల ఆలయం, అనంతపురం గంగమ్మ తల్లి ఆలయం దూపదీప నైవేద్యానికి దూరమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..