Peddi Reddy: జగన్ వస్తే సిట్ ఉండదు.. దర్యాప్తే
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:37 AM
వైసీపీ నేతలను రాష్ట్ర ప్రభుత్వం తాలిబన్లు, టెర్రరిస్టుల మాదిరి చూస్తోందని వైసీపీ సీనియర్ నేత

మమ్మల్ని ఉగ్రవాదులుగా చూస్తున్నారు
వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
రాజమండ్రి జైల్లో మిథున్‌తో ములాఖత్
సెల్యూట్ చేసి స్వాగతం పలికిన జైలు ఎస్సై
రాజమహేంద్రవరం, జూలై 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలను రాష్ట్ర ప్రభుత్వం తాలిబన్లు, టెర్రరిస్టుల మాదిరి చూస్తోందని వైసీపీ సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి కుమారుడు, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనను ములాఖత్ ద్వారా బుధవారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిశారు. అనంతరం రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో ప్రభుత్వ మద్యం దుకాణలను తీసేసిన అప్పటి సీఎం కేజ్రీవాల్.. వాటిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన కుంభకోణంలో ఆయన జైలుకు వెళ్లారు. ఏపీలో కూడా ఇప్పుడు అలాంటి కుంభకోణమే జరుగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటిపై ‘సిట్’లాంటివేమీ వేయం. నేరుగా దర్యా ప్తే చేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైసీపీ నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు. అయినా ఇబ్బంది లేదు. నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే న్యాయస్థానాలనే ఆశ్రయిస్తాం. మిథున్ రెడ్డి బాగున్నారు. సంతోషంగా ఉన్నారు.’’ అని అన్నారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. ‘‘మిథున్ రెడ్డిపై కేసు ఒక డ్రామా. మా ప్రభుత్వం ఎలాంటి డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. ధరలు పెంచడంతో మద్యం నియంత్రణ జరిగింది.’’ అని పేర్కొన్నారు.
‘భక్తి’ చాటిన సబ్ ఇన్‌స్పెక్టర్
వైసీపీ నేతలు రామచంద్రారెడ్డి, వనిత, భరత్‌లకు సబ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు సెల్యూట్ చేయడం విమర్శలకు దారితీసింది. రాజమండ్రి జైలు మొదటి గేటు వద్ద కారు దిగి లోపలకు వెళుతుండగా వైసీపీ నేతలకు జైలు సిబ్బంది(ఎ్‌సఐ క్యాడర్) ఒకరు సెల్యూట్ చేశారు. అంతేకాదు, వారిని సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకువెళ్లారు.
మిథున్‌కు సహాయకుడా!
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైల్లో సహాయకుడిని నియమించాలని కోర్టు ఆదేశించడం పట్ల రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ విస్మయం వ్యక్తం చేశారు. ‘సహాయకుడు’ అనే మాట జైలు మాన్యువల్‌లోనే లేదన్నారు. మిథున్‌రెడ్డికి ఈ సదుపాయం కల్పిస్తే మిగిలిన ఖైదీలు కూడా ఇలాంటి సదుపాయాలే కోరుకుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో మిథున్‌కు కల్పించిన సదుపాయాలపై కోర్టులో రివ్యూపిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. కోర్టు ఆదేశాలతో కుర్చీ,టేబుల్,టీవీ, ఇంటి భోజనం అందించే ఏర్పాటు చేశామన్నారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!