YCP Jagan: బాబు, పవన్‌లను ఏనాడైనా అడ్డుకున్నానా
ABN , Publish Date - Jun 24 , 2025 | 06:49 AM
సీఎంగా ఉండగా తాను ఏనాడైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల పర్యటనలపై ఆంక్షలు విధించానా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

సత్తెనపల్లి పర్యటనలో నాకు జడ్ ప్లస్ ఇవ్వలేదన్నది నిజమా?
గతంలో బాబు పర్యటనలు చేయలేదా?
ఆయన వాహనం కింద ఎవరూ పడలేదా?
ఎక్స్ ఖాతాలో జగన్ వ్యాఖ్యలు
అమరావతి జూన్ 23(ఆంధ్రజ్యోతి): సీఎంగా ఉండగా తాను ఏనాడైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల పర్యటనలపై ఆంక్షలు విధించానా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తన పర్యటనలకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వకపోగా ఆంక్షలు విధించడం ఏమిటన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా కాన్వాయ్ కిందపడి సింగయ్య అనే కార్యకర్త మృతిచెందిన ఘటనలో ఆయనపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. ‘‘నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామం వెళ్లి వస్తుండగా దురదృష్టకర ఘటన జరిగింది. ఈ విషయం మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే నేను స్పందించాను. ఆ కుటుంబాన్ని కలుసుకోవాలని, రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని ఆదేశించాను. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇలాగే స్పందిం చాం. అయినా మామీద విషప్రచారం చేస్తున్నారు. మానవత్వం..నైతికత గురించి చంద్రబాబు, పవన్‌లు మాట్లాడటం ఏమిటి? వారు నాకు పాఠా లు చెప్పడం ఏమిటి’’ అని జగన్ ప్రశ్నించారు.
ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా?
మాజీ సీఎంకు జడ్ ప్లస్ సెక్యూరిటీ హక్కు కాదా? ఇష్టమైతే కల్పించి, లేనప్పుడు రద్దుచేస్తామనే అధికారం ప్రభుత్వానికుందా?
ఒకవేళ నాకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తే కాన్వాయ్ కింద మనుషులు పడతారా? ప్రొటోకాల్ ప్రకారం రోప్ పార్టీ ఉంటుంది కదా? దీన్నిబట్టి మీరు జడ్ ప్లస్ సెక్యూరిటీ నాకు ఇవ్వలేదని అనుకోవాలా? లేక కాన్వాయ్ కింద వ్యక్తి పడలేదని భావించాలా?
ఆ రోజు మీ ఎస్పీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏమిటి?
గతంలో మీ పర్యటనల్లో, మీరు నిర్వహించిన సభల్లో ఎవరూ చనిపోలేదా? వారి విషయంలో మీరు ఏం చేశారు?
మాపై కేసును కొట్టేయండి: పేర్ని, రజనీ పిటిషన్
జగన్ వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతిచెందిన ఘటనలో తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేతలు పేర్ని నాని, విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సోమవారం కోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే వీరి తరఫున న్యాయవాది ఎల్లారెడ్డి వాదిస్తూ.. కారులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రులపైనా కేసు నమోదు చేశారని, ప్రమాదానికి వాహనం నడిపిన డ్రైవర్ బాధ్యుడవుతారు తప్ప అందులో ప్రయాణిస్తున్నవారు కాదన్నారు. పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు స్పష్టం చేశారు.