Share News

YCP Jagan: ఢీకొట్టింది జగన్‌ కారే

ABN , Publish Date - Jun 23 , 2025 | 05:12 AM

జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఈ నెల 18న గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్‌ రోడ్డు వద్ద జగన్‌ కారు ఢీకొని తొక్కుకుంటూ పోయిన ఘటనలో వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య మరణించడానికి మాజీ సీఎం జగన్‌ సహా ఆరుగురు కారణమని పోలీసులు ప్రకటించారు.

YCP Jagan: ఢీకొట్టింది జగన్‌ కారే

  • డైవర్‌ ఏ1, జగన్‌ ఏ2గా కేసు నమోదు

  • కారులో ఉన్న పీఏ, వైవీ, పేర్ని, రజనిపైనా..

  • వీడియోల ఆధారంగా నిందితుల గుర్తింపు

  • కారు టైరు కింద వ్యక్తి పడ్డారని చూసీ

  • పట్టించుకోని జగన్‌, వైసీపీ నేతలు

  • న్యాయ సలహాతో కేసు నమోదు: ఎస్పీ

  • సింగయ్యను ఢీకొట్టింది జగన్‌ కారే

  • మాజీ సీఎంను ఏ-2గా చేర్చిన పోలీసులు

  • కారు డ్రైవర్‌, పీఏ, వైవీ, పేర్ని, రజనిపైనా కేసు

  • గుంటూరు ఎస్పీ సతీశ్‌కుమార్‌ ప్రకటన

  • తాజాగా లభించిన ఆధారాలతో 105, 49 సెక్షన్ల కింద మార్పు

  • వీడియోల ఆధారంగా నిందితుల గుర్తింపు

  • న్యాయ సలహాతో కేసు నమోదు: ఎస్పీ

గుంటూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఈ నెల 18న గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్‌ రోడ్డు వద్ద జగన్‌ కారు ఢీకొని తొక్కుకుంటూ పోయిన ఘటనలో వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య మరణించడానికి మాజీ సీఎం జగన్‌ సహా ఆరుగురు కారణమని పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో ఆయన్ను ఏ-2గా చేర్చారు. కారు డ్రైవర్‌ రమణారెడ్డి (ఏ-1), జగన్‌ పీఏ కె.నాగేశ్వరరెడ్డి (ఏ-3), ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (ఏ-4), మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని (ఏ-5), మాజీ మంత్రి విడదల రజని (ఏ-6)ని కూడా చేర్చి ఆ కేసులో సెక్షన్లను మార్చారు. తొలుత మృతురాలి సింగయ్య భార్య లూర్దుమేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్‌ 106(1) సెక్షన్‌ (నిర్లక్ష్యం కారణంగా మరణం) ప్రకారం కేసు నమోదు చేశారు.


తాజాగా లభించిన ఆధారాల ప్రకారం బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 105 (నేరపూరిత హత్య-ఉద్దేశపూర్వకంగా మరణానికి లేదా తీవ్ర గాయాలకు కారణమవడం), 49 నేరానికి ప్రేరేపించడం) కింద మార్చారు. ఆదివారం రాత్రి గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో రేంజ్‌ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలసి జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్‌ ఈ వివరాలు వెల్లడించారు. ‘పల్నాడు పర్యటనకు వెళ్తున్న క్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బాలసాని కిరణ్‌కుమార్‌ పిలుపు మేరకు గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య కూడా అక్కడకు వచ్చారు. సింగయ్య రోడ్డు పక్కన నిలబడి కారుపై పూలు చల్లేందుకు ప్రయత్నిస్తుండగా, వేగంగా వచ్చిన జగన్‌ కారు ఆయన్ను ఢీ కొట్టింది. ఆయన కింద పడిపోగా కారు ముందు చక్రం ఆయన మెడను తాకుతూ కొద్దిగా ముందుకు వెళ్లింది. పార్టీ కార్యకర్తలు పెద్దగా అరుస్తూ డ్రైవర్‌ను అప్రమత్తం చేసినా అతడు కొద్దిసేపు నిర్లక్ష్యంగానే కారును ముందుకు పోనిచ్చారు.


దీంతో సింగయ్య పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తుల్లో గుచ్చుకున్నాయి. అక్కడ గుమిగూడిన స్థానికులు, వైసీపీ కార్యకర్తలు పెద్దగా కేకలు వేసి డ్రైవర్‌ను హెచ్చరించడంతో కారును వెనక్కి నడిపి టైర్‌ కింద ఉన్న సింగయ్యను బయటకు తీశారు. కారు కింద సింగయ్య పడిన విషయం, కారు కింద నుంచి ఆయన్ను బయటకు తీసిన దృశ్యాలను డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న వారంతా ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం జగన్‌ దృష్టిలో కూడా ఉంది. అయినప్పటికీ వారు కనీసం కారు ఆపి కిందకు దిగడం గానీ, గాయపడిన సింగయ్యను పరిశీలించి ఆస్పత్రికి పంపడం గానీ చేయలేదు. ముందుకు వెళ్లిపోయారు. తర్వాత కొద్దిసేపటికే సింగయ్య మృతి చెందారు.


జగన్‌ కాన్వాయ్‌లో కారు ఢీకొని సింగయ్య మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ కేసు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో జగన్‌, కారులో ఉన్న మాజీ మంత్రులు, ఎంపీ తదితరులు మిన్నకుండిపోయారు. వాస్తవానికి పోలీసులు జగన్‌కు 11 వాహనాలతో కూడిన కాన్వాయ్‌తో పాటు అదనంగా మూడు వాహనాలకు మాత్రమే అనుమతించారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా సుమారు 50 వాహనాల్లో ఆయన తన అనుచరులు, నాయకులతో తాడేపల్లి నుంచి బలప్రదర్శనగా బయల్దేరారు. అంతేగాక ఎక్కడా వాహనాలను ఆపకూడదన్న నిబంధనను కూడా ఉల్లంఘించారు. తమ కారు కింద కార్యకర్త పడినట్లు చూసినప్పటికీ లోపల ఉన్న వారంతా ఉద్దేశపూరకంగానే మిన్నకుండిపోయారు. ఆ తర్వాత కూడా వాస్తవం చెప్పలేదు. చివరకు పోలీసులు ఆధారాలు సేకరించి వీడియో దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఎవరెవరు కారులో ఉన్నారో వారంతా కూడా నిందితులేనని న్యాయసలహా మేరకు కేసు నమోదు చేశారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తారు’ అని ఎస్పీ తెలిపారు.

Updated Date - Jun 23 , 2025 | 05:12 AM