Share News

Jagan Mohan Reddy: సంతకాల సాక్షిగా..దొరికిపోయిన జగన్‌

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:14 AM

2019లో వైసీపీ అధికారంలోకి రాగానే వాసుదేవ రెడ్డి రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వచ్చారు.

Jagan Mohan Reddy: సంతకాల సాక్షిగా..దొరికిపోయిన జగన్‌

  • ఏరికోరి వాసుదేవరెడ్డికి కీలక పోస్టులు

  • నీటిపారుదలలో నియమించాలన్న నాటి సీఎస్‌

  • కాదు.. బేవరేజెస్‌ ఎండీ పోస్టు ఇవ్వాలని జగన్‌ ఆదేశం

  • ఆపై డిస్టిలరీస్‌ కమిషనర్‌ పోస్టు కూడా అప్పగింత

  • మద్యం స్కామ్‌లో ఆ రెండు విభాగాలే కీలకం

  • వైసీపీ ఉన్నన్నాళ్లూ వాటిలో వాసుదేవ రెడ్డే

  • ‘సీఎంవో’ పేరుతోనే చాణక్య ‘ముడుపుల’ కాల్స్‌

  • ఆయన ప్రభుత్వ పెద్దల మనిషే అని ధ్రువీకరించిన వాసుదేవ రెడ్డి

(అమరావతి - ఆంధ్రజ్యోతి): 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే వాసుదేవ రెడ్డి రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వచ్చారు. ఆయనను నీటి పారుదల శాఖలో నియమించాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ... జగన్‌ దీనిని మార్చేశారు. ఆయనను ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎ్‌సబీసీఎల్‌) ఎండీగా నియమించాలని ఫైలుపై రాసి సంతకం చేశారు. పోస్టింగులలో అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రిదే కావడంతో నాటి సీఎస్‌ ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2019 సెప్టెంబరు 16న ఈ జీవో జారీ అయ్యింది. ఇది అంతటితో ఆగలేదు! డిస్టిలరీస్‌ కమిషనర్‌ పోస్టు కూడా వాసుదేవరెడ్డికి కట్టబెడితేనే ‘స్కామ్‌’ సాఫీగా సాగుతుందనే ఆలోచనతో... 2019 అక్టోబరు 31న డిస్టిలరీస్‌ కమషనర్‌ పోస్టులోనూ ఆయననే కూర్చోబెట్టాలని నాటి సీఎ్‌సను జగన్‌ ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చేముందే వాసుదేవరెడ్డితో చేసుకున్న ఒప్పందం మేరకు... వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ ఆ రెండు పదవుల్లో ఆయననే కొనసాగించారు. అంతకుముందు దాకా... ఎక్సైజ్‌ కమిషనర్‌కే ఏపీఎ్‌సబీసీఎల్‌, డిస్టిలరీస్‌ కమిషనర్‌ పోస్టుల్లో ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించేవారు. ఎక్సైజ్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి ఉంటారు. కానీ... జగన్‌ ఆ పోస్టుకు ప్రాధాన్యం తగ్గించేసి ఏపీఎ్‌సబీసీఎల్‌, డిస్టిలరీస్‌ కమిషనర్‌ పోస్టుల్లో డిప్యూటేషన్‌పై తెచ్చుకున్న అధికారిని కూర్చోబెట్టారు. తద్వారా మొత్తం స్కామ్‌ సజావుగా సాగేలా చూసుకున్నారు. ఇక... ఎక్సైజ్‌ శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న సత్య ప్రసాద్‌ను తమ వ్యూహం ప్రకారం వాసుదేవరెడ్డికి ఓఎ్‌సడీగా నియమించారు. 2019 నవంబరు 27న వైసీపీ పెద్దల సిఫారసుతోనే ఈ నియామకం జరిగింది. తమ దోపిడీకి సహకరిస్తే ఐఏఎస్‌ హోదా ఇప్పిస్తామని సత్యప్రసాద్‌కు ఎంపీ మిథున్‌ రెడ్డి హామీ ఇచ్చినట్లు సిట్‌ విచారణలో తేలింది.

సూటిగా తేలిన లింకు...

‘నేను సీఎం ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా! కమీషన్లు ఇవ్వకుంటే మీకు ఆర్డర్లు రావు’ అని ఎస్‌ఎన్‌జే కంపెనీ యజమానికి లిక్కర్‌ స్కామ్‌ నిందితుడు బూనేటి చాణక్య (ఏ-8) ఫోన్‌ చేసి సూటిగా చెప్పారని తేలింది. ‘ముడుపులు ఇవ్వలేను’ అని ఆయన బదులిచ్చారు. దీంతో ఆర్డర్లు ఆగిపోయాయి. ఇది... నాటి ప్రభుత్వ పెద్దలకు చాణక్యతో ఉన్న సంబంధానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ విషయంపై ఎస్‌ఎన్‌జే కంపెనీ యజమాని వాసుదేవరెడ్డిని కూడా సంప్రదించారు. ‘‘అవును! ఆ వ్యక్తి ప్రభుత్వ పెద్దల తాలుకానే. కమీషన్‌ ఇస్తేనే ఆర్డర్లు ఇస్తారు’’ అని చెప్పడంతో ఎస్‌ఎన్‌జే యాజమాన్యం కమీషన్లు చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది.


ఆ వెంటనే వారి బ్రాండ్‌ లిక్కర్‌కు ఆర్డర్లు మొదలయ్యాయి. జగన్‌ ‘సిఫారసు సంతకం’తో నియమితుడైన అధికారే... వసూళ్ల బ్యాచ్‌ గురించి డిస్టిలరీ యజమానికి చెప్పడం గమనార్హం. వెరసి... ఇదంతా అప్పటి ముఖ్యమంత్రికి తెలిసే జరిగిందని సిట్‌ నిర్దారణకు వచ్చింది. దీనికి తోడు జగన్‌ కుటుంబానికి చెందిన భారతీ సిమెంటు కంపెనీలో శాశ్వత డైరెక్టర్‌ అయిన బాలాజీ గోవిందప్ప హైదరాబాద్‌లోని భారతీ సిమెంట్స్‌ ఆఫీసులో లిక్కర్‌ వ్యాపారులతో సమావేశమైన వివరాలు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా సేకరించిన సిట్‌... తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దకు ఉచ్చు బిగిస్తోంది.

‘ముందస్తు’ జాగ్రత్తలు

లిక్కర్‌ స్కామ్‌లో ఇప్పటికే 12మంది జైల్లో ఉండగా మరో 12మంది కోసం కోర్టు నుంచి సిట్‌ అధికారులు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పొందారు. కీలక సూత్రధారి మిథున్‌ రెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌ రెడ్డి, జగన్‌ మాజీ ఓఎ్‌సడీ కృష్ణమోహన్‌రెడ్డి తదితరులకు స్థానిక కోర్టు నుంచి సుప్రీం దాకా ఎక్కడా ఊరట లభించలేదు. ఈ స్కామ్‌లో బలమైన ఆధారాలు ఉండటమే దీనికి కారణం. ప్రాథమిక చార్జిషీటులో జగన్‌ పాత్రపై ‘సిట్‌’ నిర్దిష్టంగా ప్రస్తావించింది. ఇప్పుడు...వాసుదేవరెడ్డి నియామకంలో ప్రత్యక్ష ప్రమేయంపై ఆధారాలు సేకరించింది. ఇటీవల నేరుగా జగన్‌ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌ కార్యాలయంలోనూ అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో... తాడేపల్లి ప్యాలె్‌సలో కలవరం మొదలైంది. తననూ అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తుండటంతో... జగన్‌ బెంగళూరు ప్యాలె్‌సలో తన పార్టీ రాజ్యసభ సభ్యుడైన న్యాయవాది బృందాన్ని అన్ని విధాలా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణం సిట్‌ నోటీసు వచ్చినా కోర్టుల్లో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేసేందుకు వైసీపీ లీగల్‌ టీమ్‌ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 200 కోట్లు కూడా లేని ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నాటి ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆ తర్వాత సీఎంగా ఉన్న కేజ్రీవాల్‌ అరెస్టయ్యారు. తెలంగాణ మాజీ సీఎం కుమార్తె కవితకూ కటకటాలు తప్పలేదు. ఇంకా... ఛత్తీ్‌సగఢ్‌లో మాజీ సీఎం భూపేష్‌ భఘేల్‌ కుమారుడు చైతన్యను ఈడీ అరెస్టు చేసింది. అక్కడ ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించి రూ.2500కోట్ల అనధికారిక లావాదేవీలు జరిపిందని 70 మందిపై అభియోగాలు మోపింది. ఏపీ లిక్కర్‌ స్కామ్‌పైనా ఈడీ దృష్టి సారించింది. దీంతో పోల్చితే మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన కుంభకోణాలు చాలా తక్కువ. కీలక పోస్టుల్లో వాసుదేవరెడ్డి నియామకం... ఆటోమెటిక్‌ మద్యం ఆర్డర్లు పెట్టే సీ-టెల్‌ను నిర్వీర్యం చేయడం నుంచి డిజిటల్‌ పేమెంట్లకు ఆస్కారం లేకుండా నగదు లావాదేవీలు జరపడం వరకు... పకడ్బందీగా జరిగింది. వీటికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు, ఇతర సాక్ష్యాలను సిట్‌ సేకరించింది.


‘లిక్కర్‌ గ్యాంగ్‌’ పిటిషన్లు వాయిదా

మద్యం కుంభకోణంలో నిందితులు విడివిడిగా దాఖలు చేసిన పలు పిటిషన్లు కోర్టులో వాయిదా పడ్డాయి. ఏ2 డి.వాసుదేవరెడ్డి, ఏ3 డి.సత్యప్రసాద్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం జరగాల్సిన విచారణను ఏసీబీ కోర్టు 31కి వాయిదా వేసింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పీఏలు బాలాజీ కుమార్‌ యాదవ్‌, నవీన్‌కృష్ణ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై జరగాల్సిన వాదనలు 1వ తేదీకి వాయిదా పడ్డాయి. కె.ధనంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను కోర్టు 1వ తేదీకి వాయిదా వేసింది. స్విమ్స్‌లో ఫిజియోథెరపి చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అదే తేదీకి వాయిదా పడింది. ఎంపీ మిథున్‌రెడ్డి ములాఖత్‌లపై జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌, ఎంపీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణనూ 1వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయాధికారి పి. భాస్కరరావు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Jul 30 , 2025 | 06:41 AM