Share News

Pattabhi ram: అమ్మఒడి రూ. 26 వేల కోట్లు ఎగ్గొట్టిన జగన్‌

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:44 AM

జగన్‌ లక్షలాది మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం నిధులు రూ.26వేల కోట్లు ఎగనామం పెట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు.

 Pattabhi ram: అమ్మఒడి రూ. 26 వేల కోట్లు ఎగ్గొట్టిన జగన్‌

  • స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభి ధ్వజం

  • జగన్‌కు ఆ అర్హత లేదు: నాదెండ్ల బ్రహ్మం

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): జగన్‌ లక్షలాది మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం నిధులు రూ.26వేల కోట్లు ఎగనామం పెట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఇచ్చిన హామీ ప్రకారం ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు బడికి వెళుతుంటే వారందరికీ తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలో జమ చేస్తుంటే వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.


తల్లుల ఖాతాల్లో

‘2019 ఎన్నికల్లో జగన్‌, ఆయన భార్య ఇచ్చిన హామీ ప్రకారం అమ్మఒడిని ప్రతి బిడ్డకు అమలు చేస్తే ఏడాదికి రూ.10వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు తల్లుల ఖాతాల్లో వేయాల్సి ఉంది. కానీ, జగన్‌ ఐదేళ్ల పాలనలో ఇచ్చింది రూ.23,877 కోట్లు మాత్రమే. జగన్‌ హయాంలో ప్రతియేటా లబ్ధిదారులను తగ్గించుకుంటూ పోయారు. 2021లో 44.48 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 2023కి ఆ సంఖ్య 42.61 లక్షలకు పడిపోయింది. నేడు కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది లబ్ధిదారులకు తల్లికి వందనం పథకంఅమలు చేస్తుంటే వైసీపీవారు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.


కాంట్రాక్టు బిల్లులు

జగన్‌ ఐదేళ్లలో రూ.23,877 కోట్లు ఇస్తే, మేం ఒక్క ఏడాదే రూ.10,090 కోట్లు ఇస్తున్నాం. ప్రజలు సంతోషంగా ఉంటే జగన్‌కు పట్టదు. అందుకే ఆయన్ను సైకో జగన్‌ అంటారు. హుందాతనం జగన్‌ డీఎన్‌ఏలోనే లేదు’ అని పట్టాభి విమర్శించారు. కాగా, ఎన్నికల ముందు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు నొక్కేసి, తన వారికి కాంట్రాక్టు బిల్లులు విడుదల చేసుకున్న ఘనత జగన్‌దని, అలాంటి వ్యక్తికి తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం విమర్శించారు.


ఒకే ఇంట్లో ఐదుగురికి వందనం

కర్నూలు జిల్లా కోసిగిలోని బెళగల్‌ నరసమ్మ కుటుంబానికి తల్లికి వందనం కింద రూ.65 వేలు జమయ్యాయి. నరసమ్మ, ఈరేష్‌ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరికి రూ.13 వేల చొప్పున రూ.65 వేలు బ్యాంకులో జమ కావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి సమక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు క్షీరాభిషేకం చేశారు.

Updated Date - Jun 16 , 2025 | 07:51 AM