Share News

YSR Birth Anniversary: వైఎస్సార్‌కు జగన్‌, షర్మిల వేర్వేరుగా నివాళి

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:06 AM

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ సీఎం జగన్‌, కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వేర్వేరుగా నివాళి అర్పించారు.

YSR Birth Anniversary: వైఎస్సార్‌కు జగన్‌, షర్మిల వేర్వేరుగా నివాళి

  • అన్న వచ్చి వెళ్లాక ఇడుపులపాయకు చెల్లి

వేంపల్లె, జూలై 8 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ సీఎం జగన్‌, కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వేర్వేరుగా నివాళి అర్పించారు. ముందుగా మంగళవారం ఉదయం 7:30కు తల్లి విజయలక్ష్మి, భార్య భారతితో కలిసి జగన్‌ పులివెందుల నుంచి రోడ్డుమార్గం ద్వారా ఇడుపులపాయ చేరుకున్నారు. బంధువులతో కలిసి వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రార్థనలు చేశారు. తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఘాట్‌ ఆవరణలోని విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 8.15 గంటలకు జగన్‌ అక్కడి నుంచి వెనుదిరిగారు. 8.30 ప్రాంతంలో తల్లి విజయలక్ష్మి, బాబాయ్‌ సుధీకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి తదితరులతో కలిసి షర్మిల వైఎస్సార్‌ సమాధికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఘాట్‌ ఆవరణలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. రెండుసార్లు రాష్ట్రంలో కాంగ్రె్‌సను అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్‌దేనన్నారు. ఆయనకు తెలంగాణలో జయంతి, వర్ధంతి రోజున వైఎస్సార్‌ మెమోరియల్‌ లేదన్నారు. ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేయాలని కోరతానన్నారు.

ఎదురెదురుగా జగన్‌, షర్మిల కాన్వాయ్‌

ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ సమీపంలో మంగళవారం ఉదయం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్‌, ఆమె సోదరి షర్మిల మధ్య విభేదాలున్న సంగతి తెలిసిందే. వారి తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 7:30గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌కు వచ్చిన జగన్‌ 8.15గంటలకు ఘాట్‌ నుంచి బయల్దేరారు. అప్పటివరకు ఇడుపులపాయ గెస్ట్‌హౌ్‌సలో వేచిఉన్న వైఎస్‌ షర్మిల 8.15గంటలకు ఘాట్‌కు బయల్దేరారు. ఆ సమయంలో ఘాట్‌ సమీపంలోని రోడ్డులో ఇరువురి కాన్వాయ్‌లు ఎదురుపడ్డాయి. ‘అన్న వెళ్లారు.. చెల్లెలు వచ్చారు’ అంటూ అక్కడ పలువురు చర్చించుకున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 05:06 AM