Share News

Space Sector: అంతరిక్ష రంగంలో ప్రగతి సాధించాం

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:41 AM

అంతరిక్ష రంగంలో గడిచిన 63 ఏళ్లలో గణనీయమైన ప్రగతి సాధించామని భారత అంతరిక్ష పరిశోధన..

Space Sector: అంతరిక్ష రంగంలో ప్రగతి సాధించాం

  • చంద్రయాన్‌-3 విజయవంతానికి శ్రమిస్తున్నాం

  • గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో -ఇస్రో చైర్మన్‌ వి. నారాయణన్‌

విశాఖపట్నం(సాగర్‌నగర్‌), జూలై 16 (ఆంధ్రజ్యోతి): అంతరిక్ష రంగంలో గడిచిన 63 ఏళ్లలో గణనీయమైన ప్రగతి సాధించామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ తెలిపారు. ఇతర దేశాలకు సైతం ఉపగ్రహ సాంకేతికతను అందించే స్థాయికి ఇస్రో చేరుకుందన్నారు. ముఖ్యంగా అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి 9 అంశాల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పినట్టు తెలిపారు. విశాఖ నగరంలోని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నారాయణన్‌ పాల్గొన్నారు. ఇస్రో ఇప్పటి వరకు 101 అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసిందని, అలాగే 35 దేశాలకు సంబంధించి 434కు పైగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించిందని ఆయన తెలిపారు. జీ-20 దేశాల కోసం 70 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ప్రత్యేక ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నామన్నారు. భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగి రావడానికి తీసుకున్న జాగ్రత్తలను ఆయన వివరించారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టును విజయవంతం చేయడానికి అహర్నిశలూ శ్రమిస్తున్నట్టు చెప్పారు. విద్యా సంస్థలతో కలసి పనిచేయడానికి ఇస్రో సిద్ధంగా ఉందని, ఇంటర్న్‌షి్‌పలు, ప్రాజెక్టుల ద్వారా ఆసక్తి గల పరిశోధకులను ప్రోత్సహిస్తామన్నారు. గీతం వైస్‌ చాన్సలర్‌(వీసీ) ప్రొఫెసర్‌ ఎరోల్‌ డిసౌజా మాట్లాడుతూ.. ఇస్రో సాధిస్తున్న ప్రగతి దేశానికి గర్వకారణమని తెలిపారు. కార్యక్రమంలో గీతం కార్యదర్శి ఎం. భరద్వాజ, గీతం ప్రో వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ డి. గుణశేఖరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 05:41 AM