Nara Lokesh-Anand Mahindra: లోకేష్-ఆనంద్ మహీంద్రా మధ్య ఆసక్తికర సంభాషణ
ABN , Publish Date - Jul 19 , 2025 | 06:36 PM
ఏపీ మంత్రి నారా లోకేష్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మధ్య 'ఎక్స్' వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మహీంద్రా కంపెనీ నుంచి కొత్తగా ఫ్యూరియో-8 ట్రక్కులు మార్కెట్లోకి విడుదలైన సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్- మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మధ్య సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మహీంద్రా కంపెనీ నుంచి కొత్తగా ఫ్యూరియో-8 ట్రక్కులు మార్కెట్లోకి విడుదలైన సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ చేశారు. సాధారణంగా సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా ట్వీట్స్ కు మంచి ఆదరణ ఉంటుందన్న సంగతి నెటిజన్లకు తెలిసిందే. అయితే, ఈ సారి ఆనంద్ మహీంద్రా తన సందేశాన్ని తెలుగులో రాశారు. ఆయన ఏమన్నారంటే.. 'ఒక్క నిర్ణయం చాలు... మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్ మార్చండి. మీ విధిని వశం చేసుకోండి.' అని రాసి సదరు కొత్త తరహా ట్రక్ గురించిన వీడియో పెట్టారు.
సదరు పోస్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. 'తెలుగు ప్రకటన చాలా బావుంది. మీ వాహనాలకు ఏపీలో మంచి ఆదరణ ఉంది. అంతేకాదు, అధునాతన ఆటోమోటివ్ వ్యవస్థ పర్యావరణాన్ని కాపాడటానికి, పెద్ద మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మహీంద్రా తయారీ కేంద్రాన్ని ఏపీలో పెట్టాలని, మీ టీంకు ఆతిథ్యం ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉన్న పుష్కలమైన అవకాశాలను అందిపుచ్చుకోడానికి పూర్తి సహకారం అందిస్తాం' అని నారా లోకేష్ రీట్వీట్ చేశారు.
లోకేష్ ట్వీట్ మీద ఆనంద్ మహీంద్రా స్పందించారు. మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. 'ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో మేం కూడా భాగస్వాములమైతే ఎంతో గర్విస్తాం. సోలార్ ఎనర్జీ, సూక్ష్మ నీటిపారుదలతో పాటు టూరిజం వంటి వివిధ రంగాలకు సంబంధించి మా బృందాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది... మున్ముందు ఏం జరగనుందో చూద్దాం' అని ఆనంద్ మహీంద్రా సమాధానమిచ్చారు. సోషల్ మీడియాలో వీరి సంభాషణ అందర్నీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఏపీ వాసుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
Read latest AP News And Telugu News