Share News

Post Meal Habits: భోజనం చేసిన వెంటనే ధూమపానం.. ఇలా చేస్తే రిస్క్‌లో పడ్డట్టే..

ABN , Publish Date - Jul 19 , 2025 | 06:00 PM

భోజనం చేశాక కొన్ని పనులు అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి చాలా మంది తెలియక చేసే ఈ పొరపాట్లు ఏవో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

Post Meal Habits: భోజనం చేసిన వెంటనే ధూమపానం.. ఇలా చేస్తే రిస్క్‌లో పడ్డట్టే..
Post Meals Habits

ఇంటర్నెట్ డెస్క్: భోజనం తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తెలియక చేసే కొన్ని పనుల వల్ల హాని తప్పదని హెచ్చరిస్తున్నారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం, భోజనం చేయగానే పడుకోవడం లేదా కాఫీ తాగడం, సిగరెట్ తాగడం వంటివి అస్సలు చేయకూడదు (Post Meals Habits).

కడుపు నిండా తిన్నాక లైట్‌గా కునుకు రావడం సహజం. అయితే, నిద్రొస్తున్నట్టు ఉంది కదా అని అలా పడుకుండి పోతే ఇబ్బందులు మొదలవుతాయి. ముఖ్యంగా కడుపులోని యాసిడ్స్‌ పైకివచ్చి ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశం ఉంది. గుండెలో మంటగా అనిపించొచ్చు. కాబట్టి, తినగానే పడుకోకూడదు. తప్పదనుకుంటే మాత్రం కాస్త శరీరం పైభాగం ఏటవాలుగా పెట్టి రెస్టు తీసుకోవాలి.

కొందరికి భోజనం చేశాక సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేస్తే ఆహారం బాగా జీర్ణమవుతుందని భావిస్తుంటారు. అయితే, ధూమపానంతో అనేక హానికారక పదార్థాలు శరీరంలోకి చేరతాయి. ఈ అలవాటు కచ్చితంగా జీర్ణక్రియకు అడ్డుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం నెమ్మదిగా జీర్ణం అయ్యి చివరకు ఎసిడిటీ కూడా రావొచ్చని హెచ్చరిస్తున్నారు. ఆహారం తరువాత ఒక్క సిగరెట్ తాగినా పది రెట్లు అధికంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి భోజనం తరువాత సిగరెట్ జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది.


భోజనం తరువాత నడక మంచిదని చెబుతున్నారు. ఇది కొంత వరకూ వాస్తవమే. భోజనం చేశాక అలా నెమ్మదిగా నాలుగు అడుగులు వేస్తే జీర్ణ క్రియ వేగవంతం అవుతుంది. సాధారణంగా భోజనం తరువాత జీర్ణవ్యవస్థకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు ఇది అవసరం. అయితే, తిన్న తరువాత వేగంగా నడక లేదా ఇతర కసరత్తులు మొదలు పెడితే కండరాలు క్రియాశీలకమవుతాయి. వాటికి రక్త ప్రసరణ పెరిగి జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి, తిన్న తరువాత 20 నుంచి 30 నిమిషాల పాటు కుదురుగా ఓ చోట ఉండటం మంచిది.

మరి కొందరికి భోజనం తరువాత టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇది కూడా తప్పని నిపుణులు చెబుతున్నారు. భోజనం తరువాత కాఫీ, టీ తాగితే శరీరం ఆహారంలోని ఐరన్‌ను పూర్తిగా తీసుకోలేదు. దీంతో, ఐరన్ లోపం తలెత్తుతుంది. కాబట్టి, రక్తహీనతతో బాధపడేవారు భోజనం తరువాత టీ, కాఫీలు అస్సలు తాగకూడదు.


ఇక కొందరు భోజనం తరువాత స్నానం చేస్తే రిలాక్స్‌గా ఉంటుందని భావిస్తారు. ఇదీ పొరపాటేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్నానం కారణంగా చర్మానికి రక్త ప్రసరణ పెరిగి జీర్ణప్రక్రియలకు తగినంత రక్తం అందదు. దీంతో, ఆహారం త్వరగా జీర్ణం కాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి, భోజనం తరువాత ఇలాంటి పనులను ఎట్టి పరిస్థితులోనూ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

చాయ్‌‌తో పాటు బిస్కెట్లు తింటారా.. మరి ఈ విషయాల గురించి తెలుసా

ఫ్యాటీ లివర్‌తో బాధపడే వారు తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవే

Read Latest and Health News

Updated Date - Jul 19 , 2025 | 06:25 PM