Viveka Case: వివేకా కేసులో సాక్షుల మరణాలపై విచారణ వేగవంతం
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:20 AM
వివేకా హత్య కేసులో కీలక సాక్షుల మరణాలపై సిట్ విచారణ వేగవంతం చేసింది. ఆరుగురు సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రీసెంట్‌గా, రంగన్న మృతితో ఈ కేసు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

కడప, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి):వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారు ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై సిట్ విచారణ చేపట్టింది. వివేకా హత్య కేసులో మొత్తం ఆరుగురు సాక్షులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటీవల కీలక సాక్షి అయిన రంగన్న మృతితో ఈ కేసును ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుని సిట్‌ను ఏర్పాటు చేసింది. వరుసగా సాక్షులు మృతి చెందడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వివేకా ఇంటి వాచ్‌మేన్ రంగన్న చనిపోవడానికి ముందు కె.శ్రీనివాసరెడ్డి 2019, సెప్టెంబరు 3న, వైఎస్ జగన్ వాహన డ్రైవరు నారాయణ యాదవ్ 2019 డిసెంబరు 6న, వైఎస్ భారతి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరు 3న, గంగాధర్‌రెడ్డి 2022 జూలైలో, డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి 2025 జనవరి 10న మరణించారు. దీంతో కొంతకాలంగా పులివెందులలో సిట్ అధికారులు విచారిస్తున్నారు. పట్టణంలో నివాసం ఉంటున్న కె.శ్రీనివాసరెడ్డి బామ్మర్ది కసునూరు పరమేశ్వర్‌రెడ్డి ఇంటికి శనివారం సిట్ బృందం వెళ్లి ప్రత్యేక వాహనంలో విచారణ కోసం లింగాల పోలీసుస్టేషన్ తీసుకువెళ్లింది. అక్కడ సుదీర్ఘంగా విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అలాగే ఈ కేసులో మరో కీలక సాక్షి మృతుడు రంగన్న భార్య సుశీలమ్మను విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసు ఇచ్చారు. రంగన్న పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు సమాచారం.
Also Read:
విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..
ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?
For More Andhra Pradesh News and Telugu News..