Share News

డ్రగ్స్‌ రవాణా చేస్తే ఆస్తులు జప్తు: అనిత

ABN , Publish Date - Mar 04 , 2025 | 06:07 AM

డ్రగ్స్‌ వినియోగించకపోయినప్పటికీ.. రవాణా చేసినా, ప్రేరేపించినా వారి ఆస్తులు జప్తు చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు.

డ్రగ్స్‌ రవాణా చేస్తే ఆస్తులు జప్తు: అనిత

Home Minister Anitha: డ్రగ్స్‌ వినియోగించకపోయినప్పటికీ.. రవాణా చేసినా, ప్రేరేపించినా వారి ఆస్తులు జప్తు చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు. ఇప్పటికే గత నాలుగు నెలల్లో రెండు చోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ వినియోగంపై గల్లా మాధవి (గుంటూరు పశ్చిమ) లేవనెత్తిన ప్రశ్నకు ఆమె జవాబిచ్చారు. ప్రతి జిల్లాలో ఈగల్‌ బృందాలు ఏర్పాటు చేశామని, కాలేజీలు, పాఠశాలల్లో కూడా ఈ టీంలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో గంజాయి సాగు 11 వేల ఎకరాల్లో ఉండగా దానిని వంద ఎకరాలకు తీసుకొచ్చామన్నారు. అది కూడా ఎక్కడ సాగవుతుందో.. 375 గ్రామాల్లో 20 హాట్‌స్పాట్లు గుర్తించామన్నారు. గతంలో 359 కుటుంబాలు గంజాయి సాగుకు సుదీర్ఘకాలం నుంచి అలవాటుపడి జీవిస్తుండగా వారికి ప్రత్యామ్నాయ మొక్కలు పంపిణీ చేసి జీవనోపాధి మార్చామని తెలిపారు. ఇటీవలి కాలంలో 40,088 కిలోల గంజాయిని పట్టుకున్నామన్నారు. అయితే మన రాష్ట్రంలో సాగు చేసిన దానికంటే ఎక్కువగా ఇతర రాష్ర్టాల నుంచి వస్తోందని చెప్పారు. పైగా గంజాయి పొడిని ఇటీవల ద్రవ రూపంలోకి మార్చి వినియోగిస్తున్నారన్నారు. డ్రగ్స్‌ కొరియర్ల ఆస్తులు జప్తుచేయాలని, అవసరమైతే యూపీ తరహాలో వారి ఇళ్లు ధ్వంసం చేసే అంశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు (గాజువాక) కోరారు. వినియోగం కంటే కొరియర్‌ చేయడం వల్ల ఎక్కువ సంపాదించడం అలవాటుగా మార్చుకున్నారని, అనేక చోట్ల చిల్లర కొట్లలోనూ గంజాయి దొరుకుతోందని.. ప్రతి నియోజకవర్గంలో డీఅడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల వద్ద ఉన్న షాపుల్లోనూ గంజాయి అమ్ముతున్నారని, ఆ షాపుల యజమానులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి (కడప) కోరారు. మెడికల్‌ షాపుల్లో పెయిన్‌ కిల్లర్లు అనధికారికంగా అమ్ముతున్నారని, వాటిని కొనుగోలు చేసి ద్రవరూపంలోకి మార్చి డ్రగ్స్‌గా తీసుకుంటున్నారని చెప్పారు. పాఠశాలలు, కాలేజీలు, కేటాయించని టిడ్కో ఇళ్లు గంజాయి వినియోగ కేంద్రాలుగా మారాయని తెనాలి శ్రావణ్‌కుమార్‌ (తాడికొండ) తెలిపారు.

Updated Date - Mar 04 , 2025 | 06:08 AM