Share News

Land Registration Rush : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల జాతర

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:26 AM

రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు శుక్రవారం కిటకిటలాడాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన క్రయ విక్రయదారులతో జాతరను తలపించాయి. ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్‌ ధరలు

Land Registration Rush : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల జాతర

  • రాష్ట్రవ్యాప్తంగా కార్యాలయాలు కిటకిట శుక్రవారం ఒక్కరోజే వేలల్లో రిజిస్ట్రేషన్లు

  • ఒక్క కాకినాడ జిల్లాలోనే 1,150 నమోదు

  • అన్ని జిల్లాల్లో వందలకొద్దీ...

  • అర్ధరాత్రి వరకూ కొనసాగిన ప్రక్రియ

  • చాలాచోట్ల మొరాయించిన సర్వర్లు

  • నేటి నుంచి భూముల ధరలు, రిజిస్ట్రేషన్‌

  • చార్జీలు పెరగనుండటంతో జనం క్యూ

  • సర్కారుకు రూ.కోట్లలో ఆదాయం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లను తలపించేలా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు శుక్రవారం కిటకిటలాడాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన క్రయ విక్రయదారులతో జాతరను తలపించాయి. ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్‌ ధరలు శనివారం నుంచి అమల్లోకి రావడం, రిజిస్ర్టేషన్‌ చార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతుండడంతో... శుక్రవారం భారీఎత్తున రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలకు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఒక్కరోజే వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక్క కాకినాడ జిల్లాలోనే 1,150 రిజిస్ట్రేషన్లు చేసినట్టు అంచనా. చాలాచోట్ల సర్వర్లు మొరాయించడంతో సందర్శకులు కొన్ని గంటలపాటు పడిగాపులు కాశారు. రాత్రి బాగా పొద్దుపోయే వరకు రిజిస్ర్టేషన్లు జరుగుతూనే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖకు కోట్లలో ఆదాయం వచ్చింది.

కోస్తాంధ్రలో కిటకిట

గత రెండు రోజులుగా ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లా వ్యాప్తంగా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి. విజయవాడ నగరంలో గాంధీనగర్‌, పటమట, గుణదల సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు భారీసంఖ్యలో వచ్చారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సర్వర్‌ నిలిచిపోయింది. సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులోకి రాలేదు. పశ్చిమగోదావరి జిల్లాలోని 15 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో రిజిస్ర్టేషన్‌ల సంఖ్య రెట్టింపయ్యింది. రిజిస్ర్టేషన్‌ శాఖకు వారం రోజుల వ్యవధిలోనే రూ.14 కోట్లు వచ్చినట్టు అంచనా. బాపట్ల జిల్లాలో రాత్రి వరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద కొనుగోలుదారులు బారులు తీరారు. ప్రకాశం జిల్లాలో గురు, శుక్రవారాలలో దాదాపు 1,300 రిజిస్ట్రేషన్లు జరిగాయి.


రాయలసీమలో రద్దీ

అనంతపురం జిల్లా పరిధిలోని 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో సాధారణ రోజుల్లో 180 నుంచి 200 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ధరల పెరుగుల నేపథ్యంలో శుక్రవారం ఒక్క రోజే 698 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కర్నూలు జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో రిజిస్ర్టేషన్లు చేయించుకునేందుకు ఎగబడ్డారు.

ఉత్తరాంధ్రలో జోరుగా

శ్రీకాకుళం జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలలో రాత్రి 8గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. విశాఖ జిల్లాలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలన్నీ సందడిగా మారాయి. విజయనగరం జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి.

వెబ్‌సైట్‌లో వివరాలు

ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్‌ ధరలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 16,997 గ్రామాలు.. మున్సిపాలిటీలు, పంచాయితీలతో 9054 వార్డులలో భూముల ధరలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో 158 గ్రామాలు, అర్బన్‌లో 145 వార్డులలో భూముల ధరలను ప్రభుత్వం తగ్గించింది. మరో 68 గ్రామాల్లో భూముల ధరల్లో ఎలాంటి మార్పులూ లేవు. వివరాలను శనివారం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 03:26 AM