Kurnool: అధిక వడ్డీ ఆశ చూపి ఘరానా మోసం
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:41 AM
శ్రేయ ఇన్‌ఫ్రా మార్కెటింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ అధిక వడ్డీ ఆఫర్లతో ప్రజల నుండి రూ.270 కోట్ల డిపాజిట్లు సేకరించి ఘరానా మోసం చేసింది. కర్నూలులో రూ.70 కోట్లు సేకరించి, చెల్లింపులు ఆపేసింది, బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.వందల కోట్ల డిపాజిట్లు సేకరించిటోకరా
దేశవ్యాప్తంగా రూ.270 కోట్లకు పైగా డిపాజిట్లు!
కర్నూలు జిల్లాలో రూ.70 కోట్ల వరకు సేకరణ
కర్నూలు, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): అధిక వడ్డీ ఆశ చూపి ఓ సంస్థ ఘారానా మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రూ.270 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరిస్తే.. కర్నూలు జిల్లా నుంచే రూ.60-70 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కంపెనీ అకౌంట్ బ్లాక్ చేశారంటూ ఆ సంస్థ చేతులెత్తేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. డిపాజిట్లు సేకరించి మోసం చేశారంటూ శ్రేయ ఇన్‌ఫ్రా మార్కెటింగ్ ప్రైవేట్‌లిమిటెడ్ కంపెనీపై ఓ వ్యక్తి ఫిర్యాదుతో కర్నూలు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాలివీ..: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కేంద్రంగా 2020లో స్థాపించిన ఈ కంపెనీకి చైర్మన్ హేమంత్‌కుమార్ రాయ్. రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి) వ్యాపారం పేరిట.. తమ వద్ద పెట్టుబడులు పెడితే ఏడాది తిరక్కుండానే రెట్టింపు ఇస్తామని మభ్యపెట్టారు. ఈ సంస్థ దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వడ్డీలు ఆశ చూపి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నట్లు సమాచారం. 2023 నుంచి కర్నూలు నగరంలో ఓ భవనం అద్దెకు తీసుకొని ఏజెంట్ల ద్వారా డిపాజిట్ల సేకరణ చేపట్టారు. జనాన్ని నమ్మించడానికి కొంత భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. మొదట్లో డిపాజిట్‌దారులకు నెలనెలా ఖాతాలో నగదు జమ చేస్తుండడంతో నమ్మకం ఏర్పడింది. 2024 జూన్ నుంచి చెల్లింపులు ఆపేశారు.
రూ.లక్షకు రూ.1.80 లక్షలు చెల్లిస్తామని..
కర్నూలు నగరంతో పాటు వామసముద్రం, తడకనపల్లెతో పాటు వివిధ గ్రామాలకు చెందిన 500-600 మంది నుంచి డిపాజిట్లు సేకరించారని సమాచారం. రూ.లక్ష డిపాజిట్ చేస్తే.. నెలకు రూ.12 వేల చొప్పున 15 నెలలకు రూ.1.80 లక్షలు గానీ, రూ.11 వేల ప్రకారం 18 నెలలు రూ.1.98 లక్షలు చెల్లిస్తామని ఆశ చూపారు. అంటే.. నెలకు నూటికి వడ్డీ రూ.5.25లు పైమాటే. మొదట్లో నెలనెలా డబ్బులు జమ చేస్తుండడంతో.. డిపాజిట్లు రూ.60-70 కోట్లకు చేరాయని, ఆ తర్వాత చెత్తులేసిందని చెబుతున్నారు. గత జూన్ నుంచి చెల్లింపులు ఆపేసినట్లు తెలుస్తోంది. ఖాతాదారులు ప్రశ్నిస్తే.. ఎన్నికల సమయంలో కంపెనీ అకౌంట్ బ్లాక్ చేయడం వల్లే చెల్లింపులు చేయలేకపోయామని, త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ కొన్ని నెలలు కాలం గడిపేశారు. ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో వడ్డీ లేకుండా మీ డబ్బులు తిరిగి వచ్చే ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారని, అదీ లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల్లో సంస్థ ఏజెంట్లు, డిపాజిట్‌దారులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాఽధ్యాయులు, కొందరు పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం.
శ్రేయ ఇన్‌ఫ్రాపై కేసు.. సీఐడీకి బదిలీ..
కర్నూలుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి గత ఏడాది నవంబరు 22న సంస్థ చైర్మన్‌తో పాటు పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సీఐడీకి బదిలీ చేశామని త్రీటౌన్ సీఐ శేషయ్య తెలిపారు. ఏడాదిగా చెల్లింపులు ఆగిన మాట నిజమేనని, డిపాజిట్ మాత్రమే చెల్లించేలా ఖాతాదారుల నుంచి ఎన్‌వోసీలు తీసుకొని హెడ్ ఆఫీసుకు పంపిస్తున్నామని, వచ్చే నెల మొదటి వారంలో చెల్లింపులు మొదలయ్యే అవకాశముందని కంపెనీ సీనియర్ లీడర్ మహేశ్ తెలిపారు.