AP High Court: 104, 108 టెండర్లలో జోక్యానికి హైకోర్టు నో
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:59 AM
104, 108 టెండర్ల నిబంధనలపై విద్యార్థి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో విద్యార్థికి సంబంధం లేదని పేర్కొంటూ, జోక్యం చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది

ఇందులో విద్యార్థికి సంబంధం ఏమిటని ప్రశ్న.. వ్యాజ్యం కొట్టివేత
అమరావతి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 104, 108 వైద్యసేవల టెండర్ నిబంధనలు సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. వీటిని ఓ విద్యార్థి సవాల్ చేయడం పై అనుమానం వ్యక్తం చేసింది. ఎవరో వెనుక ఉండి పిల్ దాఖలు చేయించారని అభిప్రాయపడింది. టెండర్ నిబంధనలపై అభ్యంతరం ఉంటే బిడ్‌లో పాల్గొనాలనుకునేవారు, అనర్హులైనవారు కోర్టును ఆశ్రయిస్తారని, ఇందులో విద్యార్థికి సంబంధం ఏమిటని ప్రశ్నించింది. టెండర్ నిబంధనల్లో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో 104, 108 వైద్యసేవల అప్పగింతకు జనవరి 31న జారీ చేసిన టెండర్ నిబంధనలను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన యు.రవితేజ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గంటా రామారావు, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎస్.ప్రణతి వాదనలు వినిపించారు.