Share News

Heavy Rains Forecast: నేడూ రేపు భారీ వర్షాలు

ABN , Publish Date - Jul 18 , 2025 | 03:37 AM

వర్షాకాలంలో.. వాతావరణ అనిశ్చితితో.. తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

Heavy Rains Forecast: నేడూ రేపు భారీ వర్షాలు

  • 23 వరకూ కొనసాగే అవకాశం

  • పలుచోట్ల పిడుగులూ పడే ప్రమాదం

విశాఖపట్నం, జూలై 17(ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో.. వాతావరణ అనిశ్చితితో.. తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా గురువారమే వర్షాలు కురిశాయి. ఇవి కొనసాగి.. శుక్రవారం నుంచి 23వ తేదీ వరకూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జార్ఖండ్‌, బిహార్‌లలో ఉన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. దీని నుంచి విస్తరించిన రుతు పవనద్రోణి తూర్పు బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతం వరకూ ఉంది. ఇంకా ఉత్తర తమిళనాడు మీదుగా తూర్పు, పడమరగా మరో ద్రోణి విస్తరించింది. వీటికి ఎండ తీవ్రత తోడు కావడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని గురువారం కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. గురువారం రాత్రికి అల్లూరి, అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం నౌకాస్ట్‌ బులెటెన్‌లో పేర్కొంది. శుక్రవారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనున్నది. ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమ మేఘాలు కోస్తా, రాయలసీమపైకి వీయనున్నాయి. ఇంకా అరేబియా సముద్రంలో బలపడిన రుతుపవన మేఘాలు దక్షిణ భారతం మీదుగా రాష్ట్రంపైకి రానున్నాయి. వీటితో శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23వ తేదీ వరకూ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది. కాగా, గురువారం కోస్తాలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, నరసాపురంలలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


పిడుగులూ పడతాయి.. అప్రమత్తంగా ఉండండి

అమరావతి: రానున్న 3రోజులూ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. చెట్ల కింద, ఎత్తైన స్తంభాల వద్ద ఉండొద్దని సూచించింది. గురువారం రాత్రి 7గంటల వరకు ఎన్టీఆర్‌ జిల్లా ఊటుకూరులో 69.2, గుంటూరు జిల్లా బేతపూడిలో 51.5, బాపట్ల జిల్లా పర్చూరులో 50.25, ఎన్టీఆర్‌ జిల్లా చీమలపాడులో 44.7, కోనసీమ జిల్లా నగరంలో 43, కృష్ణా జిల్లా బోడగుంటలో 42.5 మిల్లీమీటర్ల వాన పడింది.

ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 18 , 2025 | 03:37 AM