Minister Satyakumar Yadav: ఆరోగ్య సమాజంతోనే స్వర్ణాంధ్ర సాధ్యం
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:59 AM
స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు ఆరోగ్యంతో కూడిన సమాజం ఎంతో అవసరమని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

ఏడాదిలో ప్రజారోగ్యంలో ఎన్నో మార్పులు
ఆరోగ్యశాఖపై సమీక్షలో మంత్రి సత్యకుమార్
అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు ఆరోగ్యంతో కూడిన సమాజం ఎంతో అవసరమని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజారోగ్య రంగంలో ఎదురైన అనుభవాలు, మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలు, సాధించిన ఫలితాల నేపథ్యంలో... 2025-26కు సంబంధించిన ఎజెండాపై సోమవారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యంతో కూడిన సమాజం కోసం ప్రతి ఏడాది ఒక అడుగు ముందుకు వేయాలని ఉన్నతాధికారులకు పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య రంగంలోని అస్తవ్యస్త పరిస్థితిని అధిగమించడానికి కృషి చేసిందని, ఫలితంగా కొంతమేర మార్పు తీసుకురాగలిగామని చెప్పారు. వైద్యసిబ్బంది హాజరు మొదలుకొని, అత్యాధునిక వైద్యసేవల కల్పన వరకూ 20 విషయాలపై ప్రగతిని ప్రతి మూడు నెలలకొకసారి సమీక్షిస్తానని స్పష్టం చేశారు. ఐపీఎం, డ్రగ్ కంట్రోల్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు.