Share News

Somireddy : ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ను జైలుకు పంపాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 02:54 PM

Somireddy: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Somireddy : ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ను జైలుకు పంపాలి
Somireddy Chandramohan Reddy

అమరావతి: మద్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్‌ను జైలుకు పంపాలని మాజీమంత్రి,తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బిగ్ బాస్ దురాశ వల్ల నాసిరకం మద్యం తాగి ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యం కుంభకోణం విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీని రంగంలోకి దింపాలని అన్నారు. ఇవాళ(శనివారం) నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యపానం నిషేధ హామీతో అధికారంలోకి వచ్చి, మద్యంతో పేదల ప్రాణాలు తీయటం క్షమించరాని నేరమని అన్నారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకూ రూ.3200కోట్లు మాత్రమే సీఐడీ వెలికితీసిందని, అనధికార లావాదేవీలు ఇంకా పెద్దమొత్తంలో జరిగాయని ఆరోపణలు చేశారు.


సీఐడీ మద్యం కుంభకోణం దర్యాప్తులో మరింత లోతుగా వెళ్లాలని అన్నారు. డిపోలకు పోకుండా అనధికారికంగా బయటకు వెళ్లిన మద్యం కుంభకోణం రూ.10వేల కోట్లకు పైమాటే ఉంటుందని చెప్పారు. సీఐడీ దర్యాప్తులో ఒక్కో సమాచారం బయటకు వస్తుంటే ఈడీ ఇంకా ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని ప్రశ్నించారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని షాకింగ్ కామెంట్స్ చేశారు. రూ.1.35లక్షల కోట్లు నగదు రూపంలో బదిలీ చేసి డిజిటల్ ఆంధ్రాని కాస్తా క్యాషాంధ్రగా మార్చారని విమర్శించారు. జగన్ హయాంలో అడిగిన లంచాలు ఇవ్వలేక నాటి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మెక్ డోవెల్స్ కంపెనీని మూసేసుకున్నారని అన్నారు.


మనుషుల ప్రాణాలు తీసే రసాయనాలు జగన్ హయాంలో జరిగిన మద్యం సరఫరాలో ఉన్నాయని అత్యున్నత ల్యాబ్‌లు నిర్ధారించాయని చెప్పుకొచ్చారు. నాసిరకం మద్యంతో ఎందరో పేదల ప్రాణాలు పోయాయని, దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. నాసిరకం మద్యంతో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువశాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని చెప్పారు. రూ.100 కోట్ల మద్యం కుంభకోణానికే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైతే... జగన్ హయాంలో జరిగింది రూ.10వేల కోట్ల పై బడిన కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కరోన సమయంలో కేవలం 42రోజులు మాత్రమే మద్యం దుకాణాలను మూసివేశారని చెప్పారు. మిగిలిన రోజుల్లో మద్యం దుకాణాల్లో అమ్మకాలు తగ్గి అనధికార అమ్మకాలు పెరిగాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Veerayya Chowdary: మూడు మాఫియాల పగ

YS Sharmila: బీజేపీ విధానాలతోనే దేశంలో ఉగ్రవాదం

Heatwave: ఎండ తీవ్రత.. వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 26 , 2025 | 03:57 PM