Salary Hike:గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాలు పెంపు
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:56 AM
గిరిజన సంక్షేమశాఖ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీకి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరి వేతనాలు పెంచనున్నట్టు తెలిపింది.

గిరిజన గురుకులాల్లో ఔట్ సోర్సింగ్‌కు 6-7 వేల మేరకు పెరగనున్న జీతాలు
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమశాఖ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీకి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరి వేతనాలు పెంచనున్నట్టు తెలిపింది. దీంతో ఒక్కొక్క ఉపాధ్యాయుడికి రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు వేతనం పెరగనుంది. వాస్తవానికి ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ అధ్యాపక సిబ్బందికి వేతనాలు పెరగలేదు. గత వైసీపీ ప్రభుత్వానికి వందలసార్లు విన్నవించుకున్నా కరుణించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్, మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి పలు దఫాలుగా తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో మంత్రి సంధ్యారాణి స్పందించి అధికారులు, ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులతో చర్చించారు.
సిబ్బందికి జీతాలు తక్కువగా ఉండటంతో ఎట్టకేలకు వారి వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం గిరిజన గురుకులాల్లో పనిచేసే సుమారు 1,650 మంది గెస్ట్ ఫ్యాకల్టీలకు ఒక్కొక్కరికీ రూ.6 వేల నుంచి రూ.7 వేల మేరకు వేతనాలు పెరగనున్నాయి. గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ డైరక్టర్స్, లైబ్రరియన్స్‌కు రూ.18 వేల నుంచి రూ.24 వేల వరకు వేతనాలు పెంచనున్నారు. అదేవిధంగా టీజీటీ, పీఈటీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ సిబ్బందికి కూడా ఇదే తరహాలో జీతాలు పెరగనున్నాయి. దీంతో పాటు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీలో పనిచేసే జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ డైరక్టర్లు సుమారు 58 మందికి రూ.6 నుంచి రూ.7 వేలకు పెంచనున్నారు.